పుట:Prabodha Tarangalul.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286. దేవుడు భూమిమీద ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు, ఏరూపముతో పుట్టునో ఎవరికి తెలియదు. అందువలన ఆయన అవతారమును ప్రజలు విభిన్నముగా చూస్తున్నారు.

287. మానవునిగా వచ్చు దేవుడు ఒకజన్మలో బికారిగా, ఒకజన్మలో ధనికునిగా ఉండవచ్చును. అలాగే ఒకజన్మలో బ్రహ్మచారిగా మరొకజన్మలో బహు భార్యలుగల విలాస పురుషునిగా ఉండవచ్చును. అంతమాత్రమున చాలామంది భగవంతున్ని గుర్తించలేకపోతున్నారు.

288. దేవుడు మానవునిగా భూమిమీదకు వచ్చినపుడు, ఆయనను గుర్తించని జ్ఞానులు అదే దేవుడు ముందు జన్మలో చెప్పిన మాటలనే ఆయనకే చెప్పి తమకంటే తక్కువవానిగా లెక్కింతురు.

289. దేవుడు భగవంతునిగా గతములో చెప్పిన మాటలను విశ్వసించినవారు, ఆ మాటలకు సరియగు అర్థములు తెలియక, ఆయన రెండవమారు వచ్చినపుడు ఆయననే గుర్తించలేక పోవుచున్నారు.

290. జీవుడు దేవున్ని చేరితే అదియే జీవదైవఐక్య సంధానమని, అంతటా వ్యాపించి పోవుచున్నాడని తెలియక, మోక్షమనబడు పరలోకమును ఒక స్థలమని, ఒకవిశాలమైన భవనమని అనుకొనుట అజ్ఞానము.

291. దేవుని చేరినవాడు దేవుని కంటే వేరుగా ఉండడు. కనుక వానికొక స్థలము, ఒఊరు, ఒకఇల్లు ఏది ఉండదు.

292. దేవుని చేరినవాడు దేవుడే తానై, తానేదేవుడై విశాలముగా అణువణువున వ్యాపించి ఉన్నాడు.