పుట:Prabodha Tarangalul.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276. గురువు బోధకునివలె, బోధకులు గురువువలె కనిపించుట సహజము. అయినప్పటికీి గురువు గురువే, బోధకుడు బోధకుడే!

277. భగవంతుడే నిజగురువు కావున గురువు కొంతకాలము భౌతికముగా, కొంతకాలము అభౌతికముగా ఉండును.

278. నిజగురువైన భగవంతుడొక్కడే జగతిలో జగద్గురువు. శిష్యులెక్కువ కలవాడు జగద్గురువు కాదు.

279. జగత్తులో సకలజీవులకు వర్తించు జ్ఞానమును తెలియజేయువాడు జగద్గురువు.

280. జగద్గురువైన భగవంతుడు తండ్రివీర్యముతో కాక తన సంకల్పముతోనే పుట్టును.

281. భగవంతునికి భూమిమీద తల్లి ఉండవచ్చును, కానీ తండ్రి ఉండడు.

282. పరమాత్మ ప్రతినిధి భగవంతుడు. భగవంతుడు సాకారుడు. పరమాత్మ నిరాకారుడు.

283. ప్రపంచములో భగవంతుని ద్వారా పరమాత్మను (దేవున్ని) తెలుసుకొనుటకు వీలుకలదు.

284. భగవంతుడు తప్ప మరియే ఇతర మానవుడు దేవున్ని గురించి తెలుపలేడు.

285. భగవంతుడు దేవుని (పరమాత్మ) అంశయే కావున దేవుని విషయము భగవంతునికే తెలియును.