పుట:Prabandha-Ratnaavali.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 25

గీ. ప్రమథవీరులు వివిధరూపములతోడ
హసన లను ఘనతాపనాద్య లఘుగతులు[?]
వెలయఁ గోటానుకోటులు కొలిచి వచ్చి
రతఁడు హరుఁ గొల్వ నేతెంచు నవసరమున. (ఆం) 106

సీ. కఱకుఁజీఁకటులమూఁకలు నుగ్గునూచగా నుఱిచి నూఱక త్రాగు నెఱతనంబు,
పొట్టేటిరాయని బొళయంబుఁ గదలించి వాహ్యాళిఁ గదలెడు వైభవంబు,
క్రతుభాగములు దెచ్చి కైతప్పు గాకుండ వేల్పుల కందిచ్చు వెరవుసొంపు,
మూఁడుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు వేదిపైఁ గొలువుండు విభ్రమంబు,
ఆ. నీకుఁ జెల్లు నొరుల నీతోడిసాటికిఁ
బేరు గ్రుచ్చి యెన్నలేరు జగతి
వశమె నిన్నుఁ బొగడ స్వాహావధూకుచా
భ్యున్నతప్రకాశ! యో హుతాశ! (ఆం) 107

సీ. కల్పాంతవార్ధి మోఁకాలిబంటిగ నే య తీశ్వరుఁ డొంటిమైఁ దిరిగినాఁడు?
వటపత్రవీథి నెక్కటి యున్న బాలు నే తాపసాధిపుఁడు ముద్దాడినాఁడు?
తనపేర నే తపోధనమౌళి సుస్థిర స్థితిఁ బురాణంబు సంధించినాఁడు?
హరుని మెప్పించి సంహారకాలుని జయో న్మాద మే మునిరాజు మాన్చినాఁడు?
గీ. కనియె నటువంటి సంయమీంద్రుని మహాత్ముఁ
దనయునిఁగ నమ్మృకండుని ధర్మపత్ని
సహజశివభక్తిరతుని విశ్వప్రసిద్ధు
ననఘకీర్తి మార్కండేయుఁ డనెడువాని. (ఆం) 108

సీ. జడివట్టు పడగలు, పడగలమీఁదిచోఁ గదలెడి కండ్లును, గండ్ల నడుపు
సూత్రించు జోడును, జోడుపైఁ జరియించు బంట్లును, బంట్లకుఁ బాయరాని
ధనువును, ధనువుతోఁ దగలిన యరదంబు, నరదంబుక్రిందికి నరుగు నారి,
నారి నిద్రించుబాణము, బాణ మొదవించు సూతుండు, సూతసంజాతహరులు,
గీ. గాఁగ నద్భుతార్థకరపదార్థావళి
యుల్లసిల్ల నొప్పుచున్న దిపుడు
త్రిపురహరణ కరణదృఢదత్తధీర మ
నోరథంబు దేవ! నీరథంబు. (ఆం) 109