పుట:Prabandha-Ratnaavali.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 ప్రబంధరత్నావళి

తే. క్రాలుఁగన్నులు ముద్దుమొగములుఁ దమకు
నసదృశప్రభావమునఁ జెల్వగుటఁ జేసి
మునిఁగి మీలను దలలెత్తి వనరుహములఁ
దూలపఱచిరి వనకేళివేళ సతులు. (ఆం) 25

చ. గొనయము తమ్మినూల్ చెఱకుఁగోల ధనుర్లత పూవులమ్ము లే
టును నొకమాటు తా నతనుఁడున్ మును నుగ్రు జయించె జీవరా
శి నొడుచు టేమి చెప్ప నని చేయు నుతుల్ దగు మోహనప్రవ
ర్తన గల కాముఁ డీవుత ముదంబున మీ కిలఁ గామసౌఖ్యముల్.[1] (జ) 26

చ. చనవున రెండువక్త్రములు చన్నులపా ల్గుడువంగ నొక్క మో
ము నగఁగ నొక్క యాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యము
న్గనఁగ నిదేమి పల్క దని యాలపనంబునఁ బెక్కులించు[?] ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు నీవుతన్. (ఆం) 27

సీ. చూపులకట్టు పూఁదూపులఁ జేపట్టు నబలలచూడ్కుల యాయుధములు,
తాయంబునకు గండుఁగోయిలఁ గూయించు బాలలపలుకుల మూలమంత్ర,
మెదిరికిఁ దేఁటుల నెడయాటలాడించు నబలలయలకల యాప్తబలము,
సవరణకుం జంద్రుఁ జాలించు మగువల మొగముల సేనకుఁ దగినమొగము
తే. భావభవునకు; నటుఁగాక బలమె బలము
గాఁగఁ దిరిగెనే వీరిచేఁ గాసిఁబడఁడె?
యనఁగ సౌందర్యసంపద లభినవముగ
వఱలుదురు దత్పురంబున వారసతులు. (ఆం) 28

క. తరుణవయస్కుల యౌవన
పరిపాకుల వృద్ధజనుల భటులను నిజసో
దరులను గురులనుగాఁ జూ
తురు పురము పతివ్రతాసతులు పుణ్యవతుల్. (ఆం) 29

క. తరుణుండగు శీతలకరు
మరగి వియల్లక్ష్మి తన్నుమాని ముదుకఁడున్
ఖరకరుఁడును నని ద్రొబ్బిన
కరణిన్ రవి పశ్చిమాద్రికడఁ గ్రుంకె నృపా! (ఆం) 30

  1. “ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ...క్రియాసిద్ధిః సత్వే వసతి మహతాం నోపకరణే” సుభాషితరత్నభాండాగారం 2.252