పుట:Prabandha-Ratnaavali.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 67

బసువయ్య, తులసి [సావిత్రికథ] (జ)
ఉ. అన్నగరంబు హర్మ్యములయందు ఘటించిన పద్మరాగర
త్నోన్నతకాంతిమండలము లొక్క మొగిన్ జదలేటఁ బర్వినన్
కిన్నెరకాంత లాత్మఁ దలకింతురు జంబునదీప్రవాహ మి
ట్లెన్నఁడు వచ్చె నింగికని యెత్తిన సంశయసంభ్రమమ్ములన్. (జ) 313

మ. అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళవ్రజస్ఫూర్తికిన్
గరుడం డంచితదిక్సతీకుచతటీకాశ్మీరపంకంబు పు
ష్కరభాగాటవిధాగ్రపల్లవితమాకందంబు [?] మందప్రభల్
బెరయం దూర్పునఁ గుంటువేల్పు పొడసూపెన్ దీపదండాకృతిన్. (జ) 314

క. ఆ పూర్ణశంఖపద్మ మ
హాపద్మాధిక ధనాఢ్యులై పుణ్యజన
వ్యాపారవృత్తి పెంపున
నా పౌలస్త్యున్ గణింప రప్పురివైశ్యుల్. (జ) 315

చ. ఉరగవధూజనంబులు పయోధరసంభృత కుంకుమాంకముల్
గరఁగ నిరంతరంబు నవగాహన మర్థి నొనర్చుచుండఁగా
నరుణరుచిం గనుంగొనఁగ నందమగుం బరిఖాంబుతోయ మ
ప్పురిఁ దన ఘోరవీరరసముం బ్రకటించుచునున్న కైవడిన్. (జ) 316

సీ. కమలకోరకనికాయములఁ జిక్కిన తేఁటి గమిమ్రోఁత ప్రియు కూఁతగాఁ దలంచు
వికసన్మనోజ్ఞహల్లకరాశిలోఁ దూఱి దావానలంబని తల్లడిల్లు
హంసఖండితమృణాళాంకూరములు శశి ప్రతిబింబితములని పరితపించుఁ
గల్లోలఘట్టనోద్గతఫేనపుంజంబు ఘనమైన వెన్నెల యని కలంగు
గీ. వెదకు నలుదిక్కులును జాల వెచ్చనూర్చు
తలఁకు బిసినీపలాశమధ్యమునఁ బొరలు
జాలిఁ బడి తూలు దివసావసానవేళ
జడిసి ప్రాణేశుఁ బాసిన చక్రవాకి. (జ) 317

చ. కరుణ దలిర్ప నిన్ గుటిలుఁగా మదిఁ జూడక జూటకోటిలో
నిరుపమలీలఁ జేర్చుకొని నెమ్మది నున్న పురారిఁ బాండు రు
గ్భరితశరీరుఁ జేసితివి కంతుని వైరముఁ బట్టి యక్కటా!
సరసిజవైరి! యీ విసపుజాతికిఁ బాంథవధంబు పెద్దయే? (జ) 318