పుట:Prabandha-Ratnaavali.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ గురుభ్యోనమః

పీఠిక

ప్రాచీనకావ్యాలంకారము లిప్పుడు కొన్ని బయల్పడుచుండుట మనయాంధ్రభాషావధూటి యదృష్టవిశేష మనవచ్చును. చెల్లాచెదరులై లోకమునం జేకుఱుచున్నయట్టి సుకవితాలంకారములు కాలక్రమమున వంకలుదీరి భాషాసౌభాగ్యమును బరిపుష్టపఱుపఁగలవు. క్రొంగ్రొత్తకవనములఁ గూర్చుటతోఁ బ్రాఁబడినకవనముల బయల్పఱుచుటయు భాషాసౌందర్యమునకుఁ బోషకమేగదా! గ్రంథరూపమును గైకొనకయ, లోకమునఁ జేకుఱుచున్న యాంధ్రకవితావాఙ్మయ మపారముగా నున్నది. అందుఁ గొంత భాషాయోషకుఁ బ్రాణప్రాయ మనఁదగినది కూడను; నాకిట్టి వాఙ్మయమును సేకరించుటయందుఁ గోరిక కొండంత. ప్రాచీనకవీశ్వరరచితము లగుచాటుధారలను బెక్కింటి సమకూర్చి చాటుపద్యమణిమంజరి యను పేర నింతకుముందు సంతరించితిని.[1] మఱియు, నవకము, చవి, చక్కన కలిగి యాంధ్రతావాసనలఁ బరిమళించు మధురకవితలఁ బెక్కింటి సేకరించి వేఱొకగ్రంథమును వెల్వరింపనున్నాఁడను.[2] ప్రాచీనకవీశ్వరకృతములై యీనాఁడు దొరకకున్న ప్రబంధముల నుండి ప్రాచీనులే సేకరించియుంచిన పద్యసముదాయమును “బ్రబంధరత్నావళి" యనుపేర నిప్పుడు ప్రచురించితిని.

ఇందలి పద్యములను సంకలనము సేసినవా రిర్వురు. ఒకఁడు పెద్దపాటి జగన్నాథకవి; నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపురవిజయము, అర్ధనారీశ్వరము ననిమొదలువెట్టి యిట్టితెఱఁగునఁ బెక్కువర్ణనాంశముల నేర్పఱుచుకొని యైదాశ్వాసములుగాఁ "బ్రబంధరత్నాకర" మనుపేర నీతఁడు గ్రంథము సంధానించెను. పైగ్రంథమున మొదటిమూఁడాశ్వాసములు మాత్రమే తంజాపురపు సరస్వతీపుస్తకభాండాగారమం దున్నది. కడమగ్రంథ మెక్కడను గానరాలేదు. వేఱొక్కనిపేరు తెలియరాదు. అతనిసంధాన మాంధ్రసాహిత్యపరిషద్భాండాగారమునం దున్నది. ఆసంధానమునకుఁ బేరు లేదు. మొదలు


  1. చాటు-ప్రథమ భాగము 1914: ద్వితీయభాగము 1922, 1952 (ప్రకాశకులు).
  2. ఇందు 'బాలభాష' అను విభాగము మాత్రమే వెలువడినది. 1930 (భారతి). ఇదే ఆ తరువాత గ్రంథరూపమున వెలువడినది. (ప్రకాశకులు).