పుట:Prabandha-Ratnaavali.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10


లేదు. తుదలేదు. పరిషత్తువా “రుదాహరణపద్యము"లని పేర్కొన్నారు.[1] ఈ యిర్వురకూర్పులందలి పద్యములను గ్రుచ్చియెత్తి నే నీ ప్రబంధరత్నావళిని క్రొత్త వెలయించితిని. పై యిరువుర సంఛానములం దుండినను నిప్పటికి ముద్రితములై సుప్రసిద్ధములై దొరకుచున్న నన్నయాదుల భారతాదులలోని పద్యముల నిందుఁ జేకొనలేదు. కవులను గావ్యము లందలి పద్యములు గూడ నకారాద్యక్షరక్రమమునకుఁ దార్చితిని. భాషాకవిచరిత్రాద్యపేక్షకుల కీచేఁత మిక్కిలి సాహాయ్యక మగునని చక్కఁ బర్చించియే సల్పితిని. ఇర్వురసంధానములు వేర్వేఱు తెఱఁగులవి. ఆ రెంటిని జేర్చుటలో విషయానుక్రమణికిఁ జెక్కుకలదు. పూర్వోత్తరసందర్భరాహిత్య మిప్పుడే కాక యప్పుడు నున్నది. ఆగూర్పులు కూడఁ గథాఘటితములు కావు. కావున నీమార్పుసేఁత కొంత చిక్కును దీర్చుటయే.

ప్రయోగరత్నాకరము[2] రంగరాట్ఛందము మొదలగు కొన్ని లక్షణగ్రంథములందుఁ బ్రాచీనకవికృతములుగాఁ గొన్ని ప్రబంధముల పేళ్లతో బద్యము లుదాహరింపఁబడియున్నవి. ఆ పద్యములనుగూడ నీ కూర్పునందుఁ జేర్పఁ జూచితిని గాని యాలోచింపఁగా నం దసత్యతాసంశయము సంఘటిల్లెను. గణపవరపు వేంకటకవి ప్రభృతులు కొందఱు తమకు సమ్మతము లగుకొన్ని ప్రయోగములను నిల్వరించుకొనుటకయి తమ లక్షణగ్రంథములందు లక్షణకల్పనము చేసి లక్ష్యముగాఁ బ్రాచీనకవీశ్వరకృతు లైన ట్లేవో గ్రంథనామములును, పద్యములును సృష్టించియుందు రని తోఁచెను. నన్నయ ఇంద్రవిజయము లోని దట యీ పద్యము :

క. “అంగజుఁ డను మాసటి చ
     క్కంగను రాయంచ యేనుఁగను నూకుచుఁ జే
     చెంగలువ నేజచే జెలి
     చంగవనడుచక్కిఁ గ్రుమ్మి సరగున నార్చెన్."

విశ్వాస్య మగునా? ఇట్లే భాస్కరుని సుసందోపాఖ్యానము, సోముని హరవిలాసము, భీముని నృసింహపురాణము మొదలగునవి. కావున లక్షణ

  1. ఇది నాకు శ్రీ కే. వి. లక్ష్మణరావు పంతులుగారి మూలమున వచ్చినది.
  2. ఇది గణపవరపు వేంకటకవిది. తంజాపుర పుస్తకశాలలో నున్నది.