పుట:Prabandha-Ratnaavali.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 43

పెద్దిరాజు, పొన్నాడ [ప్రద్యుమ్నచరిత్ర] (ఇ)

సీ. అమృతంబులోనికందంతయుఁ బోఁదోమి కొని పూర్ణచంద్రుండు దనరెనేని
విధుమండలంబున విధిచేత దశవంబు [?] గని పూవుఁదూపులు గ్రాలెనేని
శృంగారరస సరసీజాతులైన కో మలమృణాళంబులు పొలిచెనేని
పసిఁడికుంభములకుఁ బ్రభవించి మించు జ క్కవకవ బోదలు గలిగెనేని
తే. మెలఁత నెమ్మోము చెన్నున మించవచ్చుఁ
బొలఁతిచూడ్కుల పొలపంబుఁ బోలవచ్చు
నింతి మృదుబాహువుల దొరయింపవచ్చుఁ
జెలువ చనుఁగవ జిగి సరి సేయవచ్చు. (జ) 193

శా. అవ్యాయామపురారు లక్షుభితపారావారు లక్షీణపు
ణ్యవ్యాపారసురేంద్రు లగ్రహణచంద్రాదిత్యు లస్థావర
ప్రవ్యక్తామరభూరుహంబు లచతుర్భావాననబ్రహ్మలా
దివ్యద్వారవతీపురిం గలుగు ధాత్రీపాలు రెల్లప్పుడున్. (జ) 194

చ. ఇతవులయందు నెల్ల తన మేపును సొంపును మవ్వమున్ జిర
స్థితిఁ జెలువొందనోచి మరుసేనలకున్ బెనుప్రాపుగా సమా
తతముగఁ బెక్కు నిల్కడలు దాల్చిన మాధవలక్ష్మీయో యనన్
సతతము నొప్పెఁ జూడఁ బురనందనసుందరపాదపావలుల్. (జ) 195

చ. ఇలకు నుపేంద్రుతోఁ దగిలి యీశుఁడు వేల్పులపిండు వెండిగు
బ్బలికిని బైఁడికొండకును బాలెము నిచ్చలుఁ జేయు చంద్రసూ
ర్యుల నిలఁ దెచ్చిరో యనఁగ నొప్పగు నప్పురి హేమరత్నమం
డలిఁ దగి నాగభోగపరిణాహము లయ్యెడి దేవగేహముల్. (జ) 196

సీ. కమనీయ చిత్రసంగత గతిక్రమముల దిగ్గజాదులనడ ధిక్కరించి
లాలితగంభీరలఘుతరప్లుతముల హరిణసంఘంబుల నపహసించి
సవ్యాపసవ్యసంచరణమహోద్ధతిఁ బంచాననక్రీడ బాహు సఱిచి
మహితనిరాయాసమధ్యాజవంబుల ననిలప్రయాణంబు నతకరించి
తే. సముచితాన్వర్థపూర్ణవేగములచేతఁ
గెరలి వచ్చి తలంపులఁ గిక్కురించి
హేతిమాడ్కి నుప్పరముల నెసక మెసఁగి
పంచధారలు గల హయపంక్తు లడరు. (జ) 197