పుట:Prabandha-Ratnaavali.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44 ప్రబంధరత్నావళి

మ. కలయం గాడ్పునఁ దూలి పుప్పొడి దివిం గప్పందు మారుండు వే
డ్కల నారామరమావసంతులఁ గడంకం బెండ్లి సేయుంచుచో
వెలయంబట్టిన యుల్లభంబుపగిదిన్ వేమాఱుఁ దద్భూమిపైఁ
జెలువొందింపుచు రాలుఁ బుష్పవితతుల్ చేకొన్న ప్రాలో యనన్. (జ) 198

క. కోటలతుద మకరప్రభ
దీటుగొనం బర్వి పరులదృష్టికి నొప్పున్
బాటించి మేయ దివి రవి
ఘోటకముల కజుఁడు పసురు కొలిపిన భంగిన్. (జ) 199

సీ. గజయాన మెలఁగిన గతియైనఁ బైపడి గద్దించి తర్కించి కలఁక నొందు,
మానిని యల్గినమాడ్కిఁదోఁచినఁ దేర్ప నుంకించి భావించి యుమ్మలించుఁ,
జపలాక్షి కెమ్మోవిఁ జవిగొన్న యట్లైనఁ జెమరించి చర్చింతి చిన్నవోవు,
మదవతి కొఁగిలి గదిసిన యట్లైనఁ బులకించి తేఱి సంచలత నొందుఁ,
గీ. దన్ను నొఱసినఁగోర్కులు తగులుగొలుపు
నోలిఁ దనలోన నన్నరపాలసుతుఁడు
మానమూఁటాడ గాంభీర్యమహిమ సడల
లజ్జ గడివోవ ధైర్యంబు లావు డిగఁగ. (జ) 200

క. ద్విజశుశ్రూషాపరవశు
లజనిత పరివాదు లభినవాకృతులు[?] మహా
సుజనచరిత్రులు ధీరులు
భుజవిక్రమధనులు ఘనులు పురిశూద్రజనుల్. (జ) 201

సీ. నెలఁతుక చూడ్కి వెన్నెల గాసినఁ గుమారు వీక్షణాంభోనిధి వెల్లివిరియఁ,
బతి చూడ్కి తామరల్ పరువంబు నొందఁ దొ య్యలి చూపుటలలు చిట్టాడుచుండ,
సుదతిచూ పమృతంపుసోనయై కురిసిన వరుదృష్టి యనిమిషత్వమునఁ బొంద,
నధిపుదృష్టిప్రవాహంబు పెల్లడరిన నింతి దృఙ్మీనంబు లీఁతలాడ,
తే. వరుసఁ గౌతుకకల్లోలవలన మొలయ
రాగమకరందమత్తత ప్రజ్వరిల్ల
సంచితధ్యాన మనుప్రకాశము తలిర్పఁ
జిఱుతసి గ్గనువలలోనఁ జిక్కువడక. (జ) 202