పుట:Prabandha-Ratnaavali.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

నిచ్చిరి దానికి వారికెంతో కృతజ్ఞులము. ఆ పైకముతోనే ఇప్పుడీకార్యము నారంభింపగల్గితిమి.

అప్పుతీరి, తిప్పలు దాటి, ఆరుమాసములకొక పుస్తకము చొప్పున వెలువరింప గల్గినను పదేండ్లపాటు జరుగవలసినంతపని యున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వమును, అకాడమీలును ఈ విషయమై ఉదారముగ ఉచితరీతిని అర్థిక సహాయమందించి యీ బృహత్కార్యక్రమమునకు చేదోడువాదోడు కాగలవనియు వారి తోడ్పాటుతో శ్రీ ప్రభాకరపరిశోధకమండలి తన బాధ్యతను నెరవేర్చి ఆంధ్ర పాఠకలోకముయొక్క ఆశయమును తీర్చగలదనియు ఆశించుచున్నది.

మా కోర్కి మన్నించి అడిగినంతనే విలువగల 'భూమిక'ను రచించి యొసగిన కళాప్రపూర్ణ, విద్యారత్న శ్రీ నిడుదవోలు వేంకటరావుగారికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాము.

ఈ గ్రంథమునిప్పుడు ప్రథమముద్రణము ననుసరించి యథామాతృకముగ పునర్ముద్రించుచున్నాము, అనుబంధమున చేర్పబడిన విషయములను అందలి సూచన ననుసరించి గ్రంథమున చేర్చితిమి. ఆ కారణమున పద్యసంఖ్యాక్రమము మారినదేగాని ప్రణాళిక మారలేదు. అక్కడక్కడ పుటలలో శ్రీ శాస్త్రిగారే గుర్తించిన విషయములను అధోజ్ఞాపికలలో పేర్కొంటిమి (పుటలు 5, 6, 33, 106 లోని ఆధోజ్ఞాపికలు మాత్రము మేము క్రొత్తగా చేర్చినవని మనవి.) గ్రంథమున శీర్షికల ప్రక్కనగల (ఆం); (జ); (ఇ)—అను సంకేతములు ప్రథమ ముద్రణము (పు. 185–189)లో గల సూచనల ననుసరించి సౌలభ్యమునకై కూర్పఁబడినవి. ఆ యనుబంధములను కూడ యథాపూర్వము గ్రంథాంతమున పరిశీలనార్ధముంచితిమి. ప్రథమ ద్వితీయ ముద్రణములందుగల పద్య సంఖ్యాక్రమము నెరుంగుటకై తుదిని పద్యానుక్రమణిక నకారాదిగా సంధానించితిమి భూమికారచయిత పేర్కొన్న పద్యసంఖ్యలు ప్రథమ ముద్రణము ననుసరించినవే.