పుట:PlagiarismHandout.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయచౌర్యాన్ని, గ్రంథచౌర్యాన్ని అర్థం చేసుకోవటం, అరికట్టడం.


Awadewit, Elcobbola, Jbmurray, Kablammo, Moonriddengirl మరియు Tony1 13 ఏప్రిల్ 2009 న రూపొందించిన చేపుస్తకానికి తెలుగు అనువాదం.


ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసం ప్రకారం గ్రంథచౌర్యం (Plagiarism) "వేరే ఎవరో రచయిత కూర్పును, భావాలని, భాషాశైలిని వాడుకొని లేదా దగ్గరగా అనుకరించి తన సొంత రచనగా చూపడం." సున్నితమైన మాటలలో చెప్పాలంటే మరొకరి మేధస్సును తన సొంతదిగా చెప్పుకోడం, పచ్చిగా చెప్పాలంటే దొంగతనం. రోబిన్ లెవిన్ పెన్స్లర్ తన రిసెర్చ్ ఎథిక్స్ : కేసెస్ అండ్ మెటీరియల్స్ (పరిశోధన మార్గదర్శకాలు : ఉదాహరణలు, వనరులు) లో చెప్పిన ప్రకారం "గ్రంథచౌర్యానికి పాల్పడిన వ్యక్తికిచ్చే అసలైన శిక్ష మేధో వర్గం నుండి వచ్చే అసహ్యభావం, ప్రతికూలత." గ్రంథచౌర్యం వికీ సముదాయానికి అప్రతిష్ఠను తేవచ్చు. వికీపీడియాకు తోడ్పడే ప్రతి వికీపీడియను సొంతంగానే వ్యాసాలను వ్రాయాలి, ఇతరుల రచనలను నేరుగా నకలు చేయ రాదు. ఇది చెప్పడానికి సులువే అయినా, గ్రంథచౌర్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం—ఇది ఒక లోతైన అంశం. మనకు తెలీకుండానే చాలా మంది వికీపీడియన్లము ఈ గ్రంథ చౌర్యానికి పాల్పడతాము. గ్రంథచౌర్యాన్ని అరికట్టడానికి మేలైన మార్గం గ్రంథచౌర్యం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం, ఎలా అరికట్టవచ్చో, ఒకవేళ మనకు గ్రంథచౌర్యం జరిగిన వ్యాసాలు ఎదురవుతే ఏమి చేయాలో అన్న విషయాలు తెలుసుకోవడమే!

గ్రంథచౌర్యాన్ని అర్థం చేసుకోవడం

వికీపీడియా ప్రాథమిక మూలం కాదు, ఇందులో మూల పరిశోధనలకు స్థానం లేదు; అందువలన వికీపీడియా వ్యాసాలలో ప్రతి విషయం కూడా ఒక నమ్మదగిన మూలంలో ప్రచురించినదై ఉండాలి. గ్రంథచౌర్యం వల్ల సమస్య ఇతరుల ఆలోచనలనో, భాషా శైలినో కాపీ కొట్టడం మాత్రమే కాదు, ఆయా ఆలోచనలని, భావాలను సదరు రచయిత చెప్పిన భావానికి విరుద్ధంగా చూపించడం - "ముఖ్యంగా అవి వికీపీడియన్ యొక్క సొంత రచన" గా ఆపాదించబడడం. ఒకవేళ విధిగా మూలాన్ని సూచిస్తూ వేరే వారి రచనలోని వ్యాఖ్యలను తీసుకొని వికీలో చూపించినా, కొటేషన్ మార్కులో పెట్టి (" లేదా ' లేదా ఇటాలిక్స్ లో) యథావిధిగా మూలంలో ఉన్న పదాలను చూపించక పోతే అది గ్రంథచౌర్యంగా పరిగణించబడుతుంది. మూలాలనేవి విశ్వవ్యాప్తంగా సమాచారానికి మూలంగా పరిగణిస్తారే తప్ప అసలు రచనలో వాడిన భాషాశైలినో, పదాలనో కాపీ కొట్టడానికి కాదు.

మూడు విధాలుగా గ్రంథచౌర్యం జరుగుతుంది : ౧. ఒక రచన నుండి అరువు తీసుకున్న పదబంధాలను, ఆలోచనలను వాడుతూ ఆ రచనని మూలంగా చూపించకపోవడం. ౨. రచన నుండి నేరుగా తీసుకున్న పదాలని/ఆలోచనలని కొటేషన్ మార్కుల్లో పెట్టి విడిగా చూపించకపోవడం. ౩. మూలం నుండి తెచ్చుకున్న పాఠ్యాన్ని సారాంశంగా వికీపీడియన్ సొంత భాషాశైలిలో కాకుండా మూలరచనలో ఉన్న వాక్యాలను యథాతథం గా వాడెయ్యటం.