పుట:Parama yaugi vilaasamu (1928).pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

496

పరమయోగివిలాసము.


గడుగోపమున మోవి గంపింప హరిగె
పుడమిపై నూఁది మూఁపున వాలు సేర్చి
తెరువున నెవ్వ రేతెంతురో యనుచు
సురగక నెదురుచూచుచు నున్నవాఁడు
కనుఁగొన మత్పూజకంటె మద్భక్త
జనులకుఁ జేయుపూజనలే ప్రియంబు
లటుగాన నీవైష్ణవాగ్రణి నిత్య
మిటు సేయుపూజకు నేను మెచ్చితిని
అతనిమనోరథం బంతయు మనము
హితమతితోడ నేఁ డీడేర్పవలయు
నని వైనతేయుని హయముఁ గావించి
యెనయ నిత్యుల నరాకృతులఁ గావించి
తనదైనయాజ్ఞచేఁ దక్కినవారు
మనుజభావము నొంది మహిఁ గొల్చి నడువ
హేమగర్భునిఁ బురోహితునిఁ గావించి
తామిరువురు మర్త్యదంపతు లగుచు
నగణితసకలభూషాన్వితమూర్తు
లగుచుఁ దత్కపటహయంబుపై నెక్కి
పసిఁడివింజామరల్ బంగారుగొడుగు
లసమానమణిమయహైమపాత్రములు