Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్వతి శివుణ్ణి అక్కడ రెండు రోజుల పాటు తన పుట్టిల్లు నిర్మించమని కోరింది. అక్కడ గణగౌరీవ్రతం చేసే ఆడ వాళ్లందరికీ తాను స్వయంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరింది.

ఈశ్వరుడు తన అలౌకిక శక్తి చేత పార్వతి కోరినట్లు చేశాడు. చాలమంది స్త్రీలు పూజార్థము వచ్చారు. వారందరూ గౌరీ ఉత్సవం చేశారు. పార్వతి అందర్నీ ఆశీర్వదించింది. ఆ మీద వాళ్లు వెళ్లిపోయారు.

అటు మీద అక్కడకు ఉన్నతకుల స్త్రీలు వచ్చారు. ఒకసారి ఆశీర్వాదం అయిపోయాక మళ్లీ ఆశీర్వాదం చేయడానికి పార్వతి సంకోచించింది. సౌభాగ్యవతులైన స్త్రీలకు నేను ఈవరకే ఆశీర్వాదం ఇచ్చివేశాను. కాబట్టి వీళ్లను మీరు ఆశీర్వదించండి. అని పార్వతి పరమేశ్వరుణ్ణి కోరింది.

పరమేశ్వరుడు వాళ్లను ఆశీర్వదించి పంపించి వేశాడు. కాని ఆ స్త్రీలకు పార్వతి ఆశీర్వాదం కలగలేదు. అందుచేత వారి సౌభాగ్యానికి కొంత న్యూనత కలిగింది.

అనంతరం పార్వతి పరమేశ్వరులు తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. మరునాడు పరమేశ్వరుడు పార్వతితో గత దినమున తాను వనములో ఉత్తరీయం మరచిపోయానని, అక్కడకు వెళ్లి దానిని తీసుకురావలసిందనీ చెప్పాడు. పార్వతి అక్కడకు వెళ్లి చూస్తుంది కదా అక్కడ ఊరూ లేదు. ఉత్తరీయమూ లేదు. మునుపటి మాదిరిగా వనం మాత్రం ఉంది.

ఇది ఇప్పుడు లోకంలో వాడుకలో ఉన్నకథ. ఈ కథ విమర్శనీయమై ఉన్నది.

ఈ కథ పౌరాణిక పాత్రలలో కూడినదే. కాని గౌరీ డోలోత్సవం మినహా మిగతా ఈ పర్వ కార్యకలాపం పౌరాణికమైంది కాదని తోచక మానదు. దేవీ పూజ ప్రబలిన కాలంలో ఈ కార్యకలాపం ఆచారంలోకి వచ్చి ఉంటుంది.

కథలో పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందినా పార్వతి ఆశీర్వాదం కలగని స్త్రీల సౌభాగ్యానికి కొంత న్యూనత కలిగింది అనడం దేవి మాహత్తును గొప్ప చేయడానికి అని స్పష్టమవుతూ ఉంది.