పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

పండ్రెండు రాజుల కథ.


ములాడు నదనెఱింగి, యాకాంతిమతి, "నాధా! మనకుమారులకు షోడశవర్షంబులు రేపటితో నిండును. తద్దివసంబున భక్ష్యభోజ్య పూజా పరికరాదులంగొని, దుర్గరక్షణియగు దుర్గామహాదేవిని బాలుఁడు పూజించివచ్చుట నా పుట్టినింటి యాచారము. ఆయాచారముప్రకారము, వీరపాలుని నేను పంపఁదలంచి యున్న దానను వానితో పాటు ధర్మపాలుం డునునరిగినవచ్చు ప్రత్య వాయమేమి? " అనిపలికెను. దేవీ పూజగావించుట,సర్వజన శ్రేయోదాయకంబే కావున రాజేంద్రుం డందుల కనుమతించెను. పూజా మిషంబున, ధర్మపాలు నెట్లయిన గతాసునిగా నొనరింప సంకల్పించిన, కాంతిమతి తన కుమారునితో రహస్యముగ, “తనయా! ఱేపటి దినబున, నీవు నీయన్న తోగలిసి, దుర్గాపూజ కరుగవలసి యున్నది. మీరొంటరిగ నట కేగుదురు గావున, గుడిలోనికిఁ బోయినంతనే నీఖడ్గంబున ధర్మపాలుని వధియింపుము! లోకు లనుమానింపకుండ నీచేతికి రక్తపుగుడ్డను కట్టు గట్టుకొని, రాజద్రోహు లేవ్వరోవచ్చి యువరాజు పై గవసిరనియు, నేనును పోరాడితిననియు, చేతికి దెబ్బతగిలెననియు చెప్పవలయును. ఈ విధంబునఁగాని, నీకు రాజ్యము లభింపఁజాలదు. మెలకువ గలిగి వర్తింపు"మని బోధించెను. గుణశాలియగు వీరపాలుఁడు, తల్లి బోధనలకు మనంబున నెంతయు నేవగించుకొనియు, నప్పటి కామె కేమియు మాఱుపలుక జూలక సమ్మతించినట్లునటించి, తనతల్లికి సోదరునిపైఁ గల యీర్ష్యకును రాజ్య కాంక్షకును విస్మయాసహ్యములఁ బూనియుండెను. మఱునాడు తగు పరికరంబులంగొని, సందెచీఁకటివేళ నొంటరిగ రాజకుమారులిరువురును, దేవీ పూజార్ధమై చనిరి.

దుర్గాదేవికి, పూజానై వేద్యాదులను, నిర్వర్తించినయనంతరమున, వీరపాలుఁడు తల్లి మాటలను స్మృతికిఁ దెచ్చుకొని, భాతృవాత్సల్యంబున, ధర్మపాలుని పాదంబులంబడి, తనతల్లివచించిన దెల్ల సాకల్యంబుగా నాతని కెఱింగించి, కన్నీరుగార్చుచు, ప్రియసోదరా! నాతల్లి నీపై నతి తరంబగు వైరముంబూనియున్నది. ఇప్పట్టున, నీవు నగరముననుంట,