పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

పండ్రెండురాజుల కథలు


దుగా నెఱింగింపకయే తన సోదరియగు మణిమంజరి ముదిరంబున కరుదెంచు నభ్యాసము గలవాఁడగుటచే నతఁ డొక్క దినంబున, మణిమంజరీ నీలలు సుఖోపవిష్టులై కొండొక శాస్త్ర ప్రసంగం బొనరించుకొను నవసరంబుస, నకస్మాత్తుగ నటకరుదెంచెను. పరపురుషాగమన కారణంబున లజ్ఞా భయంబు లుల్లంబున మల్లడిగొన నీలతటాలున నభ్యంతరప్రదేశ మున కరిగెను. వినయంబు పెంపున గొంతయు, స్త్రీ రూపంబున నున్నను సహజముగ పురుషుండగుఁ దనప్రియుండు సోదరుని కంటఁబడెనుగదా యను వెఱపున కొంతయు తన రహస్యము బహిర్గత మయ్యెనోయను సందేహభయంబులఁ గొంతయు, మణిమంజరి యనసతముఖియై మెల్లన లేచి నిలువంబడెను. స్త్రీ రూపమును ధరించి యతిలోక లావణ్యంబున వెలయుచున్న యా నీల కేతను సౌందర్యముం గాంచి ప్రధమవీక్షణంబుననే,మదనశరాఘాత బాధితుండై—— వెంటనే స్వకీయ మనోగతాభిప్రాయంబును బయల్పడనీయక, కొండొకతడవు స్వసహజాతతోఁ బ్రసగించి, ప్రసంగాంతరంబున——" చెలీ!! నీ యంతః పురంబున కొక విదుషీమణి వచ్చెననియు, నామె పాండిత్యంబున నసామాన్య యనియు వినియుంటిని. నేడు మన యాస్థానంబున కొకపండితోత్తముఁడు వచ్చి యాస్థానపండితుల నశేషంబుగ తన మేధాలులవిశేషంబునకు విద్యావివేకంబు నను పరాజితులనుగా నొనరించి మఱియెవ్వరును లేరాయని ప్రశ్నించుచున్నవాడు; ఇప్పట్టున మన మోటమినందితిమేని సంస్థాన గౌరవంబున కెంతేని కళంకము గలుగఁగలదు. తద్గౌరవంబును నిలువఁబెట్టగల భారము నీయందున్న యది. ఆపండిత శిరోమణి నోడింపగల శక్తి నీ చెలికిం గలదని భావించి తండ్రి గారియనుజ్ఞపై నే నిటకువచ్చితిని. కావున సంస్థాన గౌరవమును నిలుపుకొఱకు నీ వామెను వాదంబునకు బ్రేరేపించి పంప తప్ప"దని పలికెను. సహోదరునిపలుకుల నాకర్ణించి మణిమంజరి యాత్మగతంబునఁ బెద్దయుం దడవు యోచించి, “యాతరుణితోడ నాలోచించి తెలియజేసెద" నని యాతని నప్పటి కెట్లో సమాధానపఱచి పంపి