పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీల కేతనమహారాజు కథ

65


బడినట్లనిపించెను. నీవృత్తాంతమేమి?" యని ప్రశ్నింప, నాతడు వెఱఁగుపడుచు, “నోహో ! ఇది భూలోకమా! అట్లయిన నేను యక్షలోకము నుండి, భూమికిద్రోయఁ బడితిని కాఁబోలును. ఇంక నాకళానిలయ పై నాశవదలుకొనవలయునా?" యని వగవదొడంగెను. సునంద యాతని భీతిని బోద్రోలి యనునయించి, ఆతని యుదంతం బెల్ల నాతనినోటనేయాకర్ణించి, యొరు లేఱుంగరాకుండ నాతని కాఁడు వేసమువేసి, యంతిపురముననే యారేయి నిదురింపఁజేసెను. ప్రారంభమునఁ గొంత భీతిల్లినను, నీలకేతనుండు క్రమక్రమంబున భయవివర్జితుండై——తన్ను మనసార ప్రేమించిన నవలావణ్యవతియగు నామణిమంజరింగూడి, సురత క్రీడల మెలంగఁదొడంగె. ఆమఱుసటిదినంబున నూతనకాంత యొకతె యంతఃపురంబున నుండుటంగాంచి పలువురు పలు తెఱగులఁ బ్రశ్నింప సునంద ముందునకువచ్చి యాకాంత తనపినతల్లికూఁతురనియును గ్రామాంతరము నుండి వచ్చెననియు నదిమంచి విదుషీమణియనియు, నీలయను నామంబు గల్గినదనియు, రాజపుత్రిక కొన్ని దినంబులు దాని చెంగట విద్యాభ్యాస మొనరింపఁ గోరుచున్నదనియు వచించి యొక్కరును నోరెత్తి యాక్షేపించుట కెడము లేకుండ నొనరించెను. నీల కేతనుండును స్త్రీ రూపంబున నత్యంత మోహనా కారుఁడై స్త్రీ పురుషులను సమానగతుల సమ్మో హింపఁ జేయుచుండెను. సుగంద పల్కిన చతురవచనములవలన భయము వీడి యా రాజపుత్రికా రాజపుత్తకులు, పనలెల్ల హాస్యోక్తులతోడను, విద్యావ్యాసంగములతోడను కాలముగడుపుచు రాత్రులందు హాయిగానేక శయ్యతలంబున శయనించి మదనవిలాసంబులచే నెలలు క్షణంబులుగా గడుపుచుండిరి. మణిమంజరికి మాణిభద్రుం డను నొక సహోదరుఁ డుండెను. ఆబాలుఁడు సంప్రాప్తయౌవనుండయ్యును, సహోదరి వివాహంబుగాక మున్ను తాను పెండ్లాడఁగోరక కొంతయు, తనచిత్తంబునకు నచ్చిన బాలిక లభింపమిఁ గొంతయు నప్పటివఱ కవివాహితుండై యుండెను. సహజముగా నమ్మాణి భద్రుండు, తనరాకను మున్ముం