పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

పండ్రెండురాజుల కథలు


బంపెను. ఈ విధంబున నటకు వేటకువచ్చిన ప్రతి రాజునకు ఒకరుపంపినవాని నొకరికి పంపుచు నపారధనసంచయంబును సేకరించి, దానితో ప్రతిపట్టణమునందును, హరిదత్తచక్రవర్తి పేర సత్రములగట్టించి యశేషకీర్తివిస్తారుండయ్యెను. హరిదత్త చక్రవర్తి నెవ్వఱు, నెఱుంగకున్నను, లోకమంతయు నాతని నెఱింగియుండెను. ప్రతి రాజునకు నాతఁడు మిత్రుఁడై యుండెను. రాజు లెల్లఱు నాతనిగాంచ నభిలషించుచుండిరి. అంత నొకనాడు హరిదత్తునకు లోక సంచారంబొనరింప గోరిక వొడమ, తన బాల్యమిత్రుండగు వసంతునితో నాలోచించి, పెద్దల యానతినంది, యొక శుభ ముహూర్తంబున బయలు వెడలెను. కతిపయదినంబులగా మిత్రద్వయంబును, విదర్భ దేశంబున కరుదెంచి యందు హరిదత్తుని సత్రంబున వసింప నా సత్రాధికారి వారికి తైలాభ్యంజనస్నానమొనరించి, పంచభక్షపరమాన్న సహితంబగు భోజనంబునిడి హంసతూలికా తల్పంబున శయనింపఁ జేసి, పాద మర్దనంబునకు సేవకులను నియమింప నాతడాశ్చర్యమునందియు——తన్నువారు గుఱ్తించియుందురా యని సందేహించియు, గల్లోలపడుచుండ వసంతుడది యెఱింగి పకపక నవ్వి——"మిత్రమా! ఈ సపర్యలు మనకే కాదు. అతిధులకందఱకును జఱుగుచున్న యవి. ఇట్లు మనము శాసించితిమి, నీవు మఱచి తబ్బిబ్బగుచుంటి" వని పల్కి యటఁగల హరిదత్త లిఖతంబులగు శాసనపత్రికలం జూపి సందేహవర్జితుం జేసెను. అట కరుదెంచిన యతిధులు తదీయ సత్కృతులకలరి, "భళీ హరిదత్తచక్రవర్తీ !" యని కీర్తించువారును, ఆతనిపై పద్యములను కీర్తనలను గోడలపై వ్రాసి చనువారును, ప్రత్యక్షముగ నాచక్రవర్తి దర్శింపఁగలవాఁడు కుబేరసమానుండుగాడేయని తలంచువారునై యుండ, హరిదత్తుం డిది యెల్లగాంచి మహానందపరవశుండై వసంతునితోగలసి యా దినంబున వాహ్యాళికరిగెను. విధిసంకల్పంబున నా యుద్యానవనంబునకే, యా విదర్భరాజనందిని యగు జగదేక సుందరియు—— కూరిమి చెలియగు విలాసినితోఁగలసి విహరింపవచ్చెను. ఆకాంత యందందువిహరించుచు, సంకల్ప