పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరబాహుమహారాజు కథ

37


రాజ్యపహరణ దురాశామూలకంబని గ్రహించిన యా వీరవనిత,యందులకుఁ బ్రతీకారం బొనరింప సముద్యోగించినదియై యా రాత్రియే రహస్యంబుగ మహాబాహుని యంతి పురముం బ్రవేశించి, యాతని పుత్రుండగు క్రూరబాహువు పరుండు డోలికను సమీపించెను. ఆడోలికయందు సుఖనిద్రాముద్రితులగు నిరువురు పసిపాప లామెకుఁ గాన్పించిరి. అందొకఁడు క్రూరబాహువనియు, రెండవది తన వధూనికాపుత్రికయగు, శైలవతియనియు నెఱింగియు, నాతురంబున విమర్శింప వ్యవధి చాలమింజేసి సుశీల క్రూరసేనునకు మారుగా, శైలవతి నపహరించి రయంబున రాజసౌధంబును నిర్గమించి, స్త్రీ సహజంబగు , కృపారసంబు పెంపున నబ్బాలుని వధింపజేయాడక, తత్పుర వాసినియు సంతానహీనయు, నిరుపేదయునగు లీలావతియను కాంత, తద్వసంత కాలయామినియందు, నడువీధిలో నిద్రించుచుండ తత్పార్శ్వంబున నాబాలికంబరుండఁ బెట్టి యెందేనింజనియె. లీలావతియు వేకువనే నిద్దుర లేచి, అత్యంత సౌందర్యశాలినియగు బాలిక యొకతె తన శయ్యయందుండుటంగాంచి తనకు పరమేశ్వరుఁడు ప్రసాదించిన వరప్రసాదిని యని భావించి మహానందంబునఁ దనభర్తయగు తారాపతికిఁ జూపి యాబాలకు చిత్రయను నామకరణంబొనరించి, యల్లారు ముద్దుగాఁ బెంచుకొనఁదొడంగెను. ఆపురంబున, నతిగౌరవనీయ క్షత్రియ వంశోద్భవుఁడును దరిద్రుఁడునునగు, చిత్రరథుండను వాఁడు నిజోదర పోషణార్ధమై రాత్రివేళల నదవికింజని కట్టెలంగొట్టి తద్విక్రయధనమూలంబున జీవించుచుండువాడు, ఆనాటి రాత్రియు నాతఁడొక వృక్షము నారోహించి చంద్రికా ప్రసారంబున కట్టెలుగొట్టనుంకించుచుండ, వీరబాహువునపహరించిన కిరాతుఁడు విధివశంబున తద్వృక్షమూలంబునకే వచ్చి బాలునిచంపనెంచి కత్తినిపై కెత్తుటయు, బాలుఁడు రోదనం బొనరించుటయుగాంచి, చిత్రరథుండు తనకును సంతానము లేనందున హృదయము దయామయంబగుడు, గుభాలున నాతరు శాఖనుడి భూమికుఱికి,