పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

పండ్రెండురాజుల కథలు


తాను రాజ్యమును చాలించి, కుమారుఁడగు చిరకారికిఁ బట్టాభిషేక మొనఱించి వానప్రస్థుఁడై శేషంబగు జీవితంబును ప్రమోదంబున గడిపెను.


నాల్గవనాటి రాత్రి కథ.

పదంపడి, యథాపూర్వకంబుగం దురీయ దివసయామినీ సమయంబునఁ గృష్ణార్జునులు, యమునా సైకత ప్రదేశంబున సుఖాసీనులై——యున్న తరి పార్థుండు నారాయణుం దిలకించి, పంచముద్రల రహస్యంబు నెఱిఁగించు వినోదకథ నోండెఱింగింపుమని వేడుటయు, నాతఁడు బావమఱఁదిం జూచి, వీరబాహుమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు నివేదింప నారంభించెను,

వీర బాహుమహారాజు కథ.

ఫల్గుణా! తొల్లి యుత్కళ దేశంబును పరిపాలించిన శూరబాహు మహారాజునకుఁ మహాబాహువను సహోదరుం డొక్కఁడుండెను. శూరబాహువునకు వీరబాహువను పుత్రుండను, మహాబాహువునకు క్రూరబాహువను కుమారుఁడునుఁ గల్గియుండిరి——ధర్మప్రభువై చిరకాలము రాజ్యపాలనం బొనరించి, వృద్ధాప్యంబు పైకొన, సుశీలయను భార్యను, ఏక పుత్రుఁడగు వీరబాహువును వదలి పరలోకంబున కరిగెను. సోదర మరణానంతరమున రాజ్యాపహరణ దుర్భుద్ధి జనింప, మహాబాహువు, యువరాజు నెట్లెనఁ బోకార్పనెంచి, యర్ధరాత్రంబునఁ గొందఱు కిరాతులకు యువరాజు నపహరించి నడుకాన నఱికి వేయున ట్లానతిచ్చెను. మహాబాహువువలన ధనలాభమునొందిన తత్తిరాతు లంతఃపురమునం దూరి, సుశీల మొఱ్ఱోయని యేడ్చుచుండ బలవంతమున యువరాజుం గొని చనిరి. ఈ క్రూరకృత్యం బెల్ల తన మఱఁదియగు మహాబాహుని