పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27


కొన్ని దినములకు మాతృకతో ఆ పుస్తకమును పోల్చిచూడ ఏవో కొన్నిమాటలు తప్ప గ్రంథమంతయు మాతృకకు సరియైన నఖలుగ నుండెనంట.

ఖయ్యాము మధ్యవయస్సు


నిజాముల్ ముల్కు ప్రసాదించిన జాగీరులవలనను, మలిక్ షా ఆదరణమువలనను ఖయ్యాము మధ్యవయస్సు సుఖముగ గడచెను. రాజస్థానమునందు, పండితగోష్ఠులందు సరస సల్లాపములాడుచు, శిష్యులకు పాఠము చెప్పుచు, ప్రకృతి రమణీయకమును తనివార క్రోలుచు, ఇష్టమున్నపుడు ఒక్కొక్క రుబాయి శిష్యులయెదుట ఆశు వుగ చెప్పుచు, సాఖియందియిచ్చు ద్రాక్షాసవమానుచు, పచ్చ బయ ళుల విహరించుచు, సెలయేటిపాటల నాలకించుచు, వనభోజనము లారగించుచు, వెన్నెలగోష్ఠులు సలుపుచు ఖయ్యాము నిర్విచారము గను, శాంతముగను జీవితము గడుపుచుండెను. మెర్వుపట్టణ పాలకుడగు సదరుద్దీన్ మహమ్మదు అతనిని హెచ్చుగ నాదరించు చుండెను; సంజరు షాహి అర్ధాసనమిచ్చి గౌరవించుచుండెను. ఈ విధముగ ఖయ్యాము జీవితము కొంచెమించుమించు ఏబదిసంవత్సరముల వయస్సువరకు వేరుప్రతిష్ఠలతోను, భోగభాగ్యములతోను పెంపొందు చుండెను. “భోగముల ననుభవింపుము. మధువానుము. గతముగతంబే; భవిష్యదర్థము సంశయాంధ సంవృతము;వర్తమానమొక్కటే అనుభావ్యము. జీవితము వాతూలములోని దివ్వె.ప్రాయము ప్రతిక్షణము గతించిపోవుచున్నది. రాలినపూపులు మరలవికసింపవు. త్వరపడుము" అను నట్టి భావములుగల రుబాయీలు ఖయ్యాము మధ్యవయస్సునను, తత్ పూర్వమును రచింపఁబడినవని మనమూహింపవచ్చును. ఆనాఁటి జీవితము ఈ క్రింది పద్యమున మూర్తి భవించి యున్నది.

32