పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

పారసీక సాహిత్యము: చారిత్రక సింహావలోకనము

ప్రపంచ వాఙ్మయములయందు పారసీక సాహిత్యము చుక్కలలో శుక్రుఁడట్లు కనుతగులుచున్నది. మృదుమధుర శబ్ద సారస్యము గలిగి శ్రుతిహితముగనుండు ప్రాచ్యభాషలలో పారసీకభాష యొకటియని నిస్సంశయముగఁ జెప్పవచ్చును. ఛందస్సులోని వివిధగతుల వలన పాదాంతార నియమమువలన పారసీక పద్యములు, గేయములు చదువునపుడు, వినునపుడు మనోహరముగ నుండును.

పారసీక నాగరికత యెట్లు రెండు శాఖలుగ విభక్తమైయున్నదో అట్లే వాఙ్మయముకూడా పురాతనమనియు, ఆధునికమనియు ప్రస్ఫుట భేదములతో రెండుపాయలుగ చీలియున్నది. అరబ్బులు పారశీకమును జయించి, మహమ్మదీయ మతమును వ్యాపింపఁజేయుటకు పూర్వముండిన వాఙ్మయమువేఱు; అటవెనుకపుట్టిన వాఙ్మయము మఱొకతీరు.

పారసీకు లార్యులు; అగ్ని పూజకులు. హిందువులకు వేదములవలె వారికి `అవెస్తా' యను పవిత్ర మతగ్రంథము గలదు. ఆ గ్రంథము పురాతన పారసీక భాషయగు `జెందు' నందు వ్రాయఁబడి యున్నది. జెందు భాషలో మతసంబంధములగు రచనలు తప్ప లౌకికమలగు కావ్యములగపడుటలేదు.

పూర్వమొకప్పుడు పారసీకము నాగరికత, శూరత్వము, సంగర కళాకౌశలము అత్యున్నత దశయందుండినవి. దేరియసువంటి మహా