పుట:PadabhamdhaParijathamu.djvu/790

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్ట - చెట్టు 764 చెట్టు - చెట్టు

చెట్టవట్టు

  • 1. వివాహ మాడు. పాణిగ్రహణము సేయు. పెండ్లిలో పాణిగ్రహణం ప్రధానము కనుక అందుపై వచ్చినది.
  • "....ఈ లతాంగి వసుధావరు నెన్నఁడు చెట్టవట్టునో?" వసు. 3. 43.
  • "చెలఁగి శ్రీకృష్ణరాయలఁ జెట్టబట్టి." కృష్ణా. 4. ఆ.
  • 2. చేయి పట్టుకొను.
  • "చెట్ట వట్టి నిజాంకంబుఁ జేర్పఁ జూచునంత." శుక. 1. 296.

చెట్టాపట్టాలు పట్టు (కొను)

  • చేతులు చేతులు కలుపుకొను.
  • "అట్టియెడ సైంధవోపల, పట్టికలం గట్టినట్టి పలు మెట్టికలన్, మెట్టి డిగి కొలనుఁ జొచ్చిరి, చెట్టాపట్టాలు వట్టి శీతాంశుముఖుల్." బహులా. 2. 54.
  • రూ. చెట్టాపట్టాలు వేసుకొను.

చెట్టాపట్టాలు వేసుకొను

  • చేతులు చేతులు కలుపుకొను.
  • "వా రిద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు." వా.

చెట్టు కట్టు

  • నిలద్రొక్కుకొను; వర్ధిల్లు.
  • "నినుఁ గూర్చి చెట్టుకట్టెను గాలవ తపస్వి, ప్రబలించె రుచి మందపాల మౌని." బహు.1. 116.
  • "భక్తి సంయుక్తి యనుపోఁతపాల నొయ్యఁ, జెట్టు కట్టుచు ముని శాఖి నిట్ట చూప." పాండు. 3. 139.
  • చూ. చెట్టు గట్టు.

చెట్టు కొకడుగా పాఱు

  • చెల్లాచెద రై పాఱిపోవు.
  • "ఒకఁడు వోయిన త్రోవ వే ఱొకఁడు వోక, చెట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచులపుడు." మను. 4. 103.
  • నేటికీ వాడుకలో - 'ఆ యింటివా ళ్లందరూ చెట్టు కొక్కడూ, పుట్ట కొక్కడూ గా పోయారు.' 'చెట్టు కొక్కడూ గుట్ట కొక్కడూ' అని కూడా అంటారు.

చెట్టు కొకడు పుట్ట కొకడు అగు

  • దిక్కులు పట్టి పోవు.
  • "ఆ యింటి యజమాని చనిపోయేసరికి కొడుకు లందరూ చెట్టు కొకడూ పుట్ట కొకడూ అయి పోయారు." వా.

చెట్టు కొకడై చను

  • చెల్లాచెద రై - దిక్కు కొకరుగా పోవు.
  • "బకనిభు లాపతితుని దోఁ,చికొని రయం బడరఁ జనిరి చెట్టు కొకరుఁ డై." పాండు. 3. 54.

చెట్టు కొట్టి పై వేసికొను

  • తనకు తా నై చిక్కులు తెచ్చి పెట్టుకొను.
  • "కుడిచి కూర్చుండ లేక చెట్టు గొట్టి పయి వేసికొన్నాడు." ధర్మజ. 70 పు. 2 పం.