పుట:PadabhamdhaParijathamu.djvu/691

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రుడ్డి - గ్రుడ్డు 665 గ్రుడ్డె - గ్రుడ్లు

గ్రుడ్డికాసు

  • మారనికాసు. చిల్లి గవ్వ వంటిమాట. మల్లభూ. వైరా. 3.

గ్రుడ్డి కొక్కిరాయి

  • గుడ్డికొంగ.

గ్రుడ్డిగవ్వ

  • గుడ్డికాసు.

గ్రుడ్డిదీపము

  • వెలుగు లేని చిన్నదీపము.

గ్రుడ్డిదొరతనము

  • గుడ్డిదర్బారు.
  • చూ. గుడ్డిదర్బారు.

గ్రుడ్డిబేరము

  • తెలివితక్కువ బేరము. బ్రౌన్.

గ్రుడ్డివడు

  • చీకటిపడు.
  • "కొన్ని దేశంబు లిరులచే గ్రుడ్డివడియె." కాశీ. 1. 137.

గ్రుడ్డివాటుగా

  • కాకతాళీయంగా.
  • గుడ్డివాని చేతిరాయివలె ఏదో తగిలిన దనుపట్ల అను సామ్యం.

గ్రుడ్డివెన్నెల

  • మసక వెన్నెల.

గ్రుడ్డులోపలి చిన్నకూన.

  • పసిపాప.
  • "అడ్డపట్టులపాప యవు నఁటే లేక, గ్రుడ్డు లోపలి చిన్ని కూనయో యమ్మ!" సారం. 2. 305.

గ్రుడ్డెఱ్ఱ

  • కన్నెఱ్ఱ. కోపము.
  • కోపము వచ్చినప్పుడు కను గ్రుడ్డు ఎఱ్ఱవడును కావున వచ్చిన పలుకుబడి.
  • "అకట! గ్రుడ్డెఱ్ఱ బాదరాయణుని మీఁద." భీమ. 4. 12.

గ్రుడ్లకొలదిగ కన్నీరు గ్రుక్కి కొను

  • కండ్లనిండా నీళ్లు పెట్టుకొను.
  • "లెస్స తెఱుపాటు గొట్టితి లెమ్మటంచు, గ్రుడ్లకొలఁదిగఁ గన్నీరు గ్రుక్కి కొనుచు." శుక. 3. 197.
  • చూ. గ్రుడ్లనిండా నీళ్లు పెట్టుకొను. కళ్లనిండా నీళ్లు పెట్టుకొను.

గ్రుడ్లు తినుటయె గాక గూ డెక్కి కూయు

  • చెడ్డపని చేసి దానిని బాహాటముగా చెప్పుకొను.
  • "ఏమేమీ! గ్రుడ్లు దింటయుం గాక గూ డెక్కి కూసెద వీవేశ్యయుం దాసియు నీ కన్నుల కెంత ప్రియ మైన నయిరి గాక నీకు సరతుగా నిట్లు పలుక నెట్లు నోరాడె." భోజ. 7. 171.

గ్రుడ్లు మిడికించు

  • గుడ్లు మిటమిట లాడించు. క్రీడా. పు. 73.

గ్రుడ్లు మెఱము

  • గ్రుడ్లుఱిమి చూచు.