ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గొఱ - గొఱు 650 గొఱ్ఱె - గొఱ్ఱె
- "ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాచిఁన ట్టరిగి టెంకిఁ గని..." మను. 4. 48.
గొఱగయ్య (డు)
- ఈశ్వరుడు.
- శైవులలో నేటికీ ఒక వర్గం గొఱగయ్య లని జంగాలవలెనే ఉంటారు. వారి వేషం చిత్రంగా ఉంటుంది. వీరు జంగాలవలెనే తిరుగుతూ భిక్ష చేస్తారు. కుమా. 7. 38.
గొఱిగించు
- 1. ఖర్చు పెట్టించు.
- "ఆ దత్తపుత్రుణ్ణి గొఱిగిస్తూ వీడు మహా అట్టహాసంగా వెలిగి పోతున్నాడు." వా.
- 2. క్షౌరము చేయించు.
- "తల గొఱిగింపఁ బంచె." కాళ. 1. 48.
గొఱుగులు వడు
- గొఱగ బడు.
- "గొఱుగులు వడ్డ వెండ్రుకలు..." పద్మ. 2. 191.
గొఱుపడము
- నల్ల కంబళి.
- గొఱ్ఱె చర్మముపై వచ్చి, నల్లకంబళి అన్న అర్థంలో నిలిచింది.
- "నెఱ నెన్నిమాఱులు నీళ్ల లోపలను, గొఱుపడం బుదికిన మఱి తెల్ల నగునె?" బస. 7. 207.
గొఱ్ఱె
- ఒక తిట్టు. చవట, అజ్ఞాని అనుట.
- "వాడు ఒట్టి గొఱ్ఱె. వాడికి ఏం చెప్పి తే ఏం లాభం?" వా.
గొఱ్ఱెతోకగా ఉండు
- ఎదగనిదిగా ఉండు.
- 'గొఱ్ఱెతోక బెత్తెడే' అన్న సామెతపై వచ్చిన పలుకుబడి. ఎదుగుబొదుగులు లేనిది. గొఱ్ఱెతోక పుట్టినప్పు డెంతో తరువాత కూడా ఎదుగుబొదుగులు లేకుండా అలాగే ఉండి పోతుంది.
- "ఎంత చేసిన ఆ పని గొఱ్ఱెతోకగానే ఉంది." వా.
గొఱ్ఱెదాటు
- ఒకరిని గుడ్డిగా అనుసరించి పదిమంది పోవుట. ముందున్న గొఱ్ఱె ఎటు పోతే మిగత మందంతా అటే పోతుం దనుటపై వచ్చిన పలుకుబడి.
- "రెడ్డికొడుకు తెల్లజుబ్బాలు వేయడం మొదలెట్టేసరికి ఊరంతా అదే మొదలు పెట్టారు. అంతా గొఱ్ఱెదాటు." వా.
గొఱ్ఱెవలె వెఱ్ఱికూతలు కూయు
- అజ్ఞానభాషితము లాడు.
- "ఓరి! నైరృత ! గొఱ్ఱెవలె యేల వెఱ్ఱి కూతలు కూశేవురా." హేమా. 29 పు.