పుట:PadabhamdhaParijathamu.djvu/677

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొల - గొలు 651 గొల్ల - గొల్లు

గొలగొల లాడు

  • గోల చేయు.
  • "చిలుకలు గొరవంకలు గో,యిల లరిచలు నెమలిగములు నెడపక యెపుడున్, గొల గొల లాడుచు విరహుల, నిలువఁగ నిచ్చునె వనంబు నీకుం గొఱయే." శివలీ. 2. 76.

గొలుసుకట్టు

  • విడివిడిగా కాక కలిసికట్టుగా వ్రాసే వ్రాత.
  • చూ. గొలుసుమోడి, గొలుసువ్రాత.

గొలుసు కొను

  • ఒకదానితో నొకటి అంటి యుండు. కావ్యా. 6. 21.

గొలుసు దప్పిన కోతి

  • పట్టుకొనుట కసాధ్య మయిన వాడు; కట్టు తప్పిన కోతివంటి వా డనుట.
  • "దక్కిపోయిన వెంటఁ దగుల నా వశ మె?.... గొలుసు దప్పిన యట్టి క్రోఁతిచందమున." గౌర. హరి. ద్వి. 1506.

గొలుసుమోడి

  • గొలుసుకట్టువ్రాత
  • చూ. గొలుసుకట్టు; గొలుసువ్రాత.

గొలుసువ్రాత

  • ఒక అక్షరంలో ఇంకొక అక్షరం కలిసిపోవునట్లుగా వ్రాయువ్రాత.
  • పాతకాలం పత్రా లన్నీ గొలుసువ్రాతతో ఉంటాయి. అలవాటున్నవారు కానీ చదవలేరు.
  • చూ. జిలుగురాత.

గొల్లభామ

  • ఆకులలో ఉండి ఎగిరిపడే పురుగు. ఆకులో మిడత.

గొల్లని సాహిత్యవిద్య

  • అసంభవం.
  • గొల్లలకు చదువు రాదు అను పాతకాలపు ప్రథపై వచ్చినమాట.
  • సాతానిసామవేదం వంటి పలుకుబడి.
  • "అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య....లేవు." సుమతి.

గొల్ల సివాలు

  • గొల్ల పాటలు.
  • "గొల్లసివాలు పాడుకొనుచు." కువల. 2. 115.

గొల్ల సుద్దులు

  • ఒక రకమైన పాటలు.
  • గొల్లవాళ్లు వారి వారి కుల పెద్దలను గురించి కీర్తించే పాటలు.
  • "గ్రుక్కలు మింగుచున్ వెడగు గొల్లలసుద్దుల నెంత పాడినన్." గుంటూ. ఉత్త. 12.

గొల్లున కూయు

  • ధ్వన్యనుకరణము.