పుట:PadabhamdhaParijathamu.djvu/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాము____కాయ 447 కాయ____కాయ

  • ఇలాంటి అతికాముక స్త్రీలను కామినీభూతము లంటారు. భూత విశేషాలు - కామిని, శాకిని, ఢాకిని, ప్రేంఖిణి ఇత్యాదులు.
  • "కంటికి బ్రియ మగువానిన్, గెంటని తమకమున గామినీభూత మనన్, వెంటబడి..." శుక. 2. 106.

కాముకుని లజ్జ

  • అసంభవము.
  • 'కామాతురాణాం న భయం న లజ్జా' అనుటపై యేర్పడినది. రాధి. 4. 79.

కాయకము

  • 1. కష్టం, శ్రమ అను అర్థాలపై వచ్చి లాక్షణికంగా వృత్తి జీవనం అని మారినది.
  • "మఱి యెందు గాయకం బెఱు గమి జేసి." బస. 4. 118.
  • 2. సేవ; శరీరశ్రమ. ఇందుమూలంగానే పని అని కూడా అర్థ మేర్పడినది.
  • "చేయు కాయకమును శివభక్తితతికి, బాయకట్టుల సమర్పణ సేయుటయును." పండితా. ప్రథ. పురా. పుట. 477.
  • "పాయక తనచేయు కాయకంబట్ల, చేయుచు..." అదే. 479 పుట.

కాయకల్పము

  • ముదుసళ్ళకు జవ్వనం ప్రసాదించే ఆయుర్వేదప్రక్రియ.
  • "ఆ ముసలాయన కాయకల్పచికిత్స చేసుకొని ముప్పైయేళ్లవా డయ్యాడు." వా.
  • చూ. కాయసిద్ధి.

కాయకష్టము చేయు.

  • శ్రమించు. నా. మా. 97.
  • "ఏదో కాయకష్టం చేసుకొని ఆ పిల్లలను వాడు పోషించుకుంటున్నాడు." వా.

కాయక్లేశము

  • శరీరశ్రమ.
  • "కాయక్లేశ మేమీ లేకుండా పనులు కావాలంటే ఎలా?" వా.

కాయగసరులు

  • కాయలూ కసురులూ. జం.
  • "జడలు ధరియించి యడవుల, నిడుమల బడి కాయగసురులే మెస వెడు పెన్..." రామాభ్యు. 6. 152.

కాయ గాచు

  • 1. సంతానము కలుగు.
  • "ఇత డొక కాయ గాచి సుతుని ల్లనిపించె మునీంద్ర." కకుత్స. 2. 64.
  • "నాలుగేన్, కాయలు గాయ వచ్చెలువ గర్భమునం దెటువంటి పాపమో." వేం. పంచ. 1, 588.
  • "ఏదో మా పిల్లకడుపున ఒక కాయ కాస్తే చూచి వెళ్ళిపోతాను." వా.
  • 2. పని సేయుట మొదలయిన వాని ద్వారా చేతులు మొదలయిన వాటిపై చర్మం గట్టిపడి కాయవలె ఏర్పడు.
  • "కట్టెలు కొట్టి కొట్టి చేతులు కాయలు కాచిపోయాయి." వా.