పుట:PadabhamdhaParijathamu.djvu/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కత్తి____కత్తి 372 కట్టి____కట్టి

కత్తిగంటము

  • ఒక వైపు తాటాకులు కోసి కొనుటకు ఉపయోగించు కత్తిగా, ఒకవైపు వ్రాయుటకు గంటముగా ఉపయోగించునది.
  • "ముదుక తలపాగయును బాహుమూల మందు, గవితె చర్మపుటొరలోని కత్తి గంట, మలతి నీర్కావి దోవతి యమర గ్రామ, కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె." శుక. 2. 416.

కత్తిగొంటులు

  • ఱాచి రంపాన పెట్టువారు.
  • "కత్తిగొంటు లైనయత్తగంతు." కుమా. 8. 135.

కత్తిపీట

  • కూరలు తఱుగుకొను కత్తి గల పీట.
  • "ఆ కత్తిపీట యిలా తీసుకు వచ్చి కూరలు తరుగు. నాకు చెయ్యి తీరడం లేదు." వా.

కత్తిమీది సాము

  • కష్టసాధ్యము; అసిధారా వ్రతము. అసలు సాము చేయుటే కష్టం. ఇక కత్తిమీద సామైతే ఏక్షణంలో నైనా తెగిపోవచ్చు ననుటపై వచ్చినపలుకుబడి.
  • "పరికింపరు దొరతనపున్, సరవుల్ మఱి కత్తిమీది సాములు సుమ్మీ!" కువల. 4. 82.
  • "వాడితో వ్యవహారం కత్తిమీది సాము. ఏకాస్త పొరబా టొచ్చినా తగులుకుంటాడు." వా.

కత్తి రాతికి పాసినగొంటు

  • మొండివెధవ, ఒక తిట్టు. కత్తితో నఱికినా, రాతితో మోదినా చావని గొంటు వెధవ అనుటపై వచ్చెనేమో.
  • "పలుగత్తి రాతికి బాసినగొంటు." గౌర. హరి. ద్వి. 651.

కత్తిరించు

  • దొంగలించు; ఖండించు.
  • "కత్తి గుత్తుకను బిఱాన గత్తిరించి." చంద్రా. 2. 88.
  • "వాడిచేతి కేది యిచ్చినా కాస్త కత్తిరించుకొని గానీ యియ్యడు." వా.
  • చూ. జేబులు కత్తిరించు.

కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు

  • వెల వెలపోయెను అనే అర్థంలో ఉపయోగిస్తారు. కత్తితో కొట్టినా రక్తం చిమ్మే స్థితిలో లే దనుట. 'ముఖంలో' అన్నట్లు ముందేదో ఉండి తీరాలి. క్రింది పలుకు బడిలోనూ అంతే.
  • "వాడు చేసిన వెధవపను లన్నీ నేను వరసపెట్టి చెప్పేసరికి, వాడి మొహాన కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు." వా.
  • చూ. కత్తి వేస్తే...

కత్తి వేస్తే నెత్తురుచుక్క లేదు

  • వెల వెలపోయె ననుట.
  • "న న్నన్ని అన్నాడా! అకస్మాత్తుగా అక్కడ నేను కనిపించేసరికి వాని మొగాన కత్తి వేస్తే నెత్తురుచుక్క లేదు." వా.
  • చూ. కత్తివాటుకు...