పుట:PadabhamdhaParijathamu.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కత____కత్త 371 కత్తి____కత్తి

కతల పుట్ట

  • కథల కాణాచి. పుట్ట అనునది నిధానము, కాణాచి అన్న అర్థంలో ఎన్నో పదాలతో చేరి వినవస్తుంది.
  • "అన విని హేమావతి మో, మున నవ్వు జనింప గతలమునిపుట్ట సుమీ, కన నీదు కడుపు బ్రహ్మకు..." హంస. 2. 71.
  • చూ. అబద్ధాల పుట్ట.

కత్తరించినట్లు

  • తుంచినట్లు, సరిగ్గా. అట్లునకు బదులు చందము, కైవడి వగైరా ఉపమాన వాచకా లన్నిటితోనూ ఇది ఉపయుక్త మవుతుంది.
  • "కత్తరించిన చందంబున బందెంబు సఱచినవిధంబున." ఉ. హరి. 3. 123.

కత్తరి గలయు

  • సంకర మగు. కత్తెరలో అటుది ఇటూ, ఇటుది అటూ కలగలసి పోవుటపై వచ్చినపలుకుబడి.
  • "వర్ణములు నాశ్రమంబులు వసుమతీశ!, కలియుగంబున గత్తరి గలసిపోవు." హరి. ఉ. 9. 37.
  • "పెరుగును వడ్లును కలిపిన, కరణిన్ వర్ణాశ్రమములు కత్తరి గలయున్." జైమి. 8. 213.

కత్తరిల్లు

  • కదలు. కత్తెర ఆడినట్లాడు అనుటపై ఏర్పడినది కావచ్చును
  • "కటము లద్రువంగ మీ సాలు గత్తరిల్ల." నైష. 7. 46.

కత్తి కట్టు

  • విరోధము పూను; పగ బట్టు. కత్తి, పోరాటానికీ పగకూ సూచకము.
  • "వాడు నామీద కత్తి కట్టి ఉన్నాడు." వా.
  • "వీడు నామీద కత్తి కట్టితే ఏం లాభం? అసలువాడు వేరే ఉన్నాడు." వా.
  • రూ. కత్తి గట్టు.

కత్తికి ఎదురు లేదు

  • వాడి మాటను కాదనేవాడు ఎవడూ లేడు. వాడు చెప్పిన ట్లెల్లా జరుగుతుంది అనుట.
  • "ఈ పది పల్లెల్లోనూ ఆ రెడ్డిగారి కత్తికి ఎదురు లేదు." వా.
  • కత్తి ఇట పరాక్రమప్రాభవ సూచకము.

కత్తికి ఒడ్డుకొను

  • కత్తిదెబ్బ కాచుకొను.
  • "వ్రేటున కెత్తినట్టి ప్రతివీరుని కత్తికి నొడ్డుకొంట యె,చ్చోటను గల్గినట్టిది." కళా. 8. 72.

కత్తికోత

  • విపరీత మైనపోరు. తాళ్ల. సం. 3.181.
  • "ఈ కత్తికోత పడలేకనే ఆ కోడలు పాపం ఈ ఇంట్లోనుండీ వెళ్ళి పోయింది." వా.