ఈ పుట ఆమోదించబడ్డది
కంటి____కంటి 330 కంటి____కంటి
కంటికి నిదుర రాదు
- నిద్ర పట్టదు; మనశ్శాంతి లేదు.
- "నిముస మైనను నాదుకంటికి నిదుర రాదు." సుగ్రీ. పు. 11.
- "వాడు ఛస్తే గానీ నా కంటికి నిద్ర రాదు." వా.
కంటికి నిదుర వచ్చు
- మనశ్శాంతి యేర్పడు.
- "నా కంటికి, నిదుర వచ్చు నేడు నీరజాక్ష!" భార. కర్ణ. 3. 390.
- "ఈ యీడువచ్చినపిల్లకు పెళ్ళయితేనే నాకంటికి నిద్ర వస్తుంది." వా.
కంటికి పంటెడునీళ్లుగా ఏడ్చు
- ఎక్కువగా ఏడ్చు. మానినీ. 49.
కంటికి పుట్టెడుగా ఏడ్చు
- ఎక్కువగా విలపించు.
- "ఎన్నా ళ్లయినా కొడుకు రాకపోయే సరికి ఆవిడకంటికి పుట్టెడుగా యేడుస్తూ కూర్చుంది." వా.
కంటికి ప్రియ మగు
- కంటి కిం పగు, మనోహర మగు.
- "పర పురుష భోగాయత్తచిత్త లగుటం గ్రందుకొను సందడిం బడి కంటికిం బ్రియ మైనవానిం గామించియు..." శుక. 2. 10.
కంటికి భార మగు
- చూడ లేక పోవు.
- "ఇపుడు విధికంటి కకట! మే మింత భార,మైతిమే యంచు దలపోసి యలమటించు." నలచ. 5. 145.
కంటికి ఱెప్పచందమున
- మిక్కిలి జాగ్రత్తగా కాపాడు పట్ల ఉపయోగించు పలుకుబడి.
- కంటిని ఱెప్ప కాపాడినంత జాగరూకతతో అనుట. చందమునకు బదులు ఉపమానార్థకాలు అన్నిటితోనూ ఇది ఉపయుక్త మవుతుంది.
- "...పాండురాజసుతు లేవురు గంటికి రెప్ప చంద మై, హరి తము గావగా వెలసి రక్షతదేహవిలాససంపదం." భార. శల్య. 1. 54.
కంటికి ఱెప్పవలె
- ఇది నేటికీ వాడుకలో ఉన్నది.
- "న న్నెప్పు డెడ సనక కంటికి, ఱెప్ప వలెం గాచి తిరుగు రేయిం బవలున్." శుక. 1. 389.
- "అన్న పోయినప్పటినుంచీ తమ్ముడు ఆ పిల్లలను కంటికి రెప్పలాగా చూచుకుంటూ వస్తున్నాడు. వా.
- చూ. కంటికి ఱెప్పచందము.
కంటికీ మంటికీ ఏకధారగా
- నిరంతరాశ్రు పాతంగా
- "కంటికి మంటికి నేకధారగా కంటి నీళ్లు కురిపించాను." ని.
కంటి తడి యార లేదు
- ఇంకా దు:ఖోపశమనము పూర్తిగా కాలేదు. ఏడువగా చిప్పిల్లిన కంటి నీళ్లింకా ఆరిపోయేంత సావకాశం కూడా లే దనుట.