పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

త్యాగాలకు సిద్ధమయ్యేటట్టు చేసింది. వేనవేల ప్రజానీకానికి ఆయన వాక్కులు వేదమంత్రాలయినవి. ఆయనను సందర్శించిన ప్రతీవ్యక్తి ఆజన్మాంతము సాధువర్తన శీలియై ఆమధురక్షణాలను తలచుకొంటూ జీవించాడు.

గాంధీజీ ఎంతటి వినయుడయినా ఆయనలో సానపెట్టిన వజ్రకాఠిన్యం ఉండేది. మృదుమధురభాషి అయినా ఆయనలో ధృఢనిశ్చయం స్పష్టంగా గోచరించేది. ఆయన కళ్ళు గంభీరముగా, ప్రశాంతంగా కనిపించినా వాటి వెనుక అచంచల దీక్ష పట్టుదల, మహోజ్జ్వల శక్తి ప్రతిబింబించేవి. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, చిత్తశుద్ధి ఎదుటివారిని వశీకరణ చేసుకొనేవి. ప్రతీవ్యక్తికీ ఆయన మాటలు తనకే ప్రత్యేక సందేశమనే భావన కలిగించేవి. విప్లవ వాదులమని చెప్పకునే వారికెవరికీ చేతగానంతగా ఆయన భారతీయ ప్రజాహృదయాలను అర్థంచేసుకోగలిగారు. ఆయన ఏదైతే ప్రవచించారో దాన్ని స్వయంగా ఆచరించి చూపారు. ఆయన రూపొందించిన శాంతియుత సహాయనిరాకరణ, సత్యాగ్రహం నిశ్చయంగా ఆయన భారతదేశానికి, ప్రపంచానికి ప్రసాదించిన అమోఘమైన అస్త్రాలు.

గాంధీ ఒక చోట ప్రసంగిస్తూ "మన మధ్య వేల కొద్దీ తాగుబోతులుండటం కంటే భారతదేశంలో అందరూ దరిద్రులయినా మంచి దేనని, తాగుడుమాన్పిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఫరవాలేదనీ, అట్లాంటి ఆదాయాన్ని వినియోగించి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టకపోయినా మెరుగే" నని చెప్పారు. మరి గాంధీజీ వారసులమంటూ మనం చేస్తూన్నదేమిటి? నగరాలలోనే కాదు, గ్రామ సీమల్లో కూడా మద్యం దుకాణాలను అనుమతించి 'ప్రజలమధ్యకు మద్యం' కార్యక్రమాలు చేపడుతున్నాం, ప్రజలకు దురలవాట్లను అంటగట్టివారిని ఆర్థికంగా కొల్లగొడుతున్నాం. "అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళగలిగిననాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పాలి" అని గాంధీజీ ప్రవచిస్తే స్త్రీకి గుడ్డపేలికలు తగిలించి, దరిదాపు నగ్నం చేసి అంగాంగ నృత్యాలు చేయిస్తూ నిర్లజ్జాకరమైన రాక్షస ఆనందాన్ని పొందటానికి యధేచ్చగా అనుమతినిస్తూన్నాం. విదేశీ వస్తువులను, బహిష్కరించమని, గ్రామీణ స్థాయిలో కుటీరపరిశ్రమలు ప్రోత్సహించమని, రైతు క్షేమమే దేశ సౌభాగ్యమని, దేశానికి గ్రామాలేపట్టు కొమ్మలని ఆయన బోధిస్తే, విదేశీ వస్తువులను, కంపెనీలను ఆహ్వానిసూ, ప్రపంచీకరణ పేరిట దేశస్వాతంత్ర్యాన్ని వాయిదాల పద్ధతిపై విదేశీయుల హస్తగతం చేస్తూన్నాము. అది ఒక పవిత్ర కార్యక్రమంలా విస్తృతమైన ప్రచారం సాగిస్తూన్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి అప్పుల

85