పుట:Oka-Yogi-Atmakatha.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

757

చీరలకు పైన కుసుమకోమలమైన కన్నెపిల్లల ముఖాలు! ఆరుబయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను. ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లులుపడ్డట్టు దబ్బాటుగా వాన కురిసింది. నవ్వుకుంటూ నేనూ శ్రీ రైట్ కారెక్కి మగన్ వాడికి ఉరికాం. వెండిరేకుల్లా మెరుపులు మెరుస్తున్నాయి ఆకాశంలో; అంత జోరుగా కురిసింది వాన.

మళ్ళీ అతిథిగృహంలో అడుగుపెడుతూ అక్కడి నిరాడంబరతా, ఆత్మత్యాగానికి నిదర్శనాలూ చూసి, మళ్ళీ మరోమాటు కొత్తగా విస్మయం చెందాను. గాంధీగారి ‘అపరిగ్రహ ప్రతిజ్ఞ,’ దాంపత్య జీవితంలో తొలి కాలంలోనే ఆచరణలోకి వచ్చింది. ఏడాదికి 60,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీలు వృత్తిని విడిచిపెట్టి మహాత్ములు, తమ సంపదను పేదవాళ్ళకు ఇచ్చేశారు.

త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీయుక్తేశ్వర్‌గారు వేళాకోళం చేస్తూ ఉండేవారు.

“బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చెయ్యలేడు,” అనేవారు ఆయన. “ ‘నా వ్యాపారం పడిపోయింది, నా పెళ్ళాం వదిలేసింది, నేను అన్నీ త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాను,’ అంటూ ఎవ రయినా విలపిస్తున్నారంటే, అతను చెబుతున్నది ఏ లౌకిక త్యాగం గురించి? సంపదనూ ప్రేమనూ అతనేమీ విడిచిపెట్టలేదు; అవే అతన్ని విడిచిపెట్టేశాయి!”

అందుకు భిన్నంగా గాంధీగారిలాంటి సాధువులు, స్పష్టంగా భౌతికవస్తు త్యాగాలు చెయ్యడమే కాకుండా, తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనంచేసి, అంతకన్న కష్టమైన స్వార్థబుద్ధినీ వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు.