పుట:Oka-Yogi-Atmakatha.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

739

ఉద్ధరించడం కోసమని చెప్పాలి. భూమినుంచి వచ్చినవాళ్ళు తమ భౌతిక కర్మావశేషాల్ని ఇంకా నిలుపుకొనే ఉన్నట్టయితే, హిరణ్యలోకంవంటి అత్యున్నత సూక్ష్మలోకానికి చేరలేరు.”

“భూమిమీదుండే వాళ్ళలో చాలామంది, సూక్ష్మలోక జీవితంవల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని లాభాల్నీ హర్షించడానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవరచుకోని కారణంగా, మరణానంతరం మళ్ళీ భూమిమీదుండే పరిమిత, అపరిపూర్ణ సుఖాలకోసమే తిరిగిరావాలని కోరుకునేటట్టుగానే, చాలామంది సూక్ష్మలోక జీవులు, కారణలోకంలోని ఆధ్యాత్మికానందమనే ఉన్నతావస్థను ఊహించుకోలేక, తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా విఘటనంచెందే సమయంలో, స్థూలతర అసహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనలమీదే మనసుపెట్టుకొని సూక్ష్మ స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారు. సూక్ష్మలోకంలో మరణించిన తరవాత, బహుసన్నని సరిహద్దులో సృష్టికర్తనుంచి వేర్పాటుగా ఉన్న కారణ భావజగత్తులో శాశ్వతనివాసం పొందగలిగే ముందు, అటువంటి వాళ్ళ భారీ సూక్ష్మలోక కర్మ క్షయం కావాలి.”

“ఒక జీవి, కంటికి ఇంపుచేసే సూక్ష్మవిశ్వంలో లభించే అనుభవాలకోసం మరేమీ కోరికలు పెట్టుకోకుండా, తిరిగి అక్కడికి వెళ్ళాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలవాడయితేనే, అతడు కారణలోకంలో ఉండిపోతాడు. అక్కడ కారణకర్మను, లేదా వెనకటి కోరికల బీజాల్ని క్షయంచేసే పని పూర్తిచేసి, బద్ధమైన ఆత్మ, అవిద్య అనే మూడు బిరడాల్లోనూ చివరిదాన్ని బయటికి నెట్టేసి, కారణ శరీరమనే కడపటి సీసాలోంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది.”

“ఇప్పుడు తెలిసిందా నీకు?” గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వారు!