పుట:Oka-Yogi-Atmakatha.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

636

ఒక యోగి ఆత్మకథ

ముగ్ధులమయాం. డా॥ వుట్జ్, మాకు దుబాసిగా వ్యవహరిస్తామని దయతో అన్నారు. మేము కూర్చున్నాక, థెరిసా నావేపు సహజ కుతూహలంలో చూస్తోందని గమనించాను; బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే.

“మీ రేమీ తినరా?” ఆమె నోటినించే జవాబు వినాలని నా కోరిక.

“ఊఁహుఁ, రోజూ పొద్దున ఆరింటికి ఒక్క హోస్ట్[1] తప్ప.”

“ఆ హోస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది!”

“కాయితమంత పలచగా, చిన్న నాణెమంత ఉరువులో ఉంటుంది,” అంటూ ఇంకా ఇలా అంది ఆమె, “అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను; అది దైవార్పితమయింది కాకపోతే మింగలేను.”

“ఆ ఒక్క దానిమీదా మీరు, నిండు పన్నెండేళ్ళపాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ?”

“నేను దేవుడి వెలుగువల్ల జీవిస్తున్నాను.”

ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది! ఎంత ఐన్‌స్టైన్ పద్ధతిలో ఉంది!

“శక్తి, ఆకాశం (ఈథర్) నుంచి సూర్యుడినించీ గాలినించీ మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతోంది.” చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. “నే నెలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను.”

“ ‘మనిషి కేవలం రొట్టెవల్ల కాకుండా, దేవుడి నోటినించి వెలువడ్డ


  1. యుఖారిస్టిక్ పిండిరొట్టె రేకు.