పుట:Oka-Yogi-Atmakatha.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

635

ఇంతలో, ఇంగ్లీషు మాట్లాడే ఒకాయన మా పక్కన ఆగాడు; తనవల్ల, ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు, మర్యాదగా.

“థెరిసా ఎక్కడుందో నాకు కచ్చితంగా అయితే తెలీదు. కాని ఆవిడ తరచుగా, ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో, ఐక్‌స్టాట్ యూనివర్సిటీలో విదేశభాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్జ్ పుట్జ్ గారింటికి వెడుతూ ఉంటుంది,” అన్నాడాయన.

మర్నాడు పొద్దున మేము, ప్రశాంతమైన ఐక్‌స్టాట్ పట్నానికి వెళ్ళాం. డా॥ వుట్జ్ మమ్మల్ని సాదరంగా పలకరించారు ఇంటిదగ్గర; “ఔను, థెరిసా ఇక్కడే ఉంది.” నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని, మా గురించి ఆమెకు కబురు పంపాడాయన. కబురు తీసుకువెళ్ళినతను, ఆమె సమాధానంతో తిరిగి వచ్చాడు:

“తమ అనుమతి లేకుండా ఎవరినీ చూడవద్దని బిషప్పు నాకు చెప్పినప్పటికీ, భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను.”

ఈ మాటలకు నేను గాఢంగా చలించి, డా॥ వుట్జ్ వెంబడి, మేడ మీది గదిలోకి వెళ్ళాను. శాంతి, ఆనందాల పరివేషంతో ప్రకాశిస్తున్న థెరిసా, వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటిగౌనూ, మల్లెపువ్వులాటి తెల్లటి తలముసుగూ వేసుకుని ఉంది. అప్పటి కామె వయస్సు ముప్ఫై ఏడు అయినా కూడా అంతకన్న చిన్నదానిలా కనిపిస్తుంది; ఆమెలో శిశుసహజమైన స్నిగ్ధతా ఆకర్షణా ఉన్నాయి. ఆరోగ్యంగా, తీర్చి దిద్దినట్టుగా ఉన్న రూపంతో, గులాబి చెక్కిళ్ళలో, ఉల్లాసంగా ఉన్న ఈమె, ఏమీ తినని సాధ్వి!

అతి మృదువైన కరచాలనంతో థెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం, దేవుని ప్రేమికులమని తెలుసుకొని, మౌన భాషణతోనే