పుట:Oka-Yogi-Atmakatha.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

632

ఒక యోగి ఆత్మకథ

దానికి విరుద్ధంగా మందకొడిగా గడిచాయి. మహాసాగర ప్రశాంతిలో గడిచిన రోజుల్లో ఎంతో ఆనందం అనుభవించాం. అయితే, మా విరామ కాలం అల్పాయుష్కమే అయింది; ఆధునిక నౌకల వేగానికి, విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి!

ఉత్సుకత ఉన్న యాత్రిక బృందాలన్నిటిలాగే మేమూ అతివిస్తారమూ ప్రాచీనమూ అయిన లండన్ నగరంలో బాగా తిరిగాం. నేను వచ్చిన మర్నాడు కాక్స్‌టన్ హాలులో ఏర్పాటయిన పెద్ద సభలో ఉపన్యాస మిమ్మని నన్ను ఆహ్వానించారు. అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ నన్ను లండన్ శ్రోతలకు పరిచయం చేశారు. మా బృందం స్కాట్లండ్‌లో సర్ హారీ లాడర్‌గారి ఎస్టేట్‌లో ఆయన అతిథులుగా హాయిగా ఒక రోజు గడిపాం. ఆ తరవాత మేము ఇంగ్లీషు ఛానల్ దాటి యూరప్ ఖండంలో ప్రవేశించాం; నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చెయ్యాలని అనుకోడమే దానికి కారణం. కానర్‌స్రాత్‌లో ఉండే థెరిసా నాయ్‌మన్ అనే గొప్ప కాథలిక్ మార్మిక భక్తురాలిని దర్శించడానికి నా కిదే ఏకైక అవకాశమని భావించాను.

అప్పటికే కొన్నేళ్ళ కిందట నేను, ఒక వ్యాసంలో థెరిసాగురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివాను; అది ఏమిటంటే:

(1) 1898 గుడ్‌ఫ్రైడే నాడు జన్మించిన థెరిసా, ఇరవయ్యో ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదయింది; పక్షవాతం వచ్చింది.

(2) 1923 లో, ‘లిటిల్ ఫ్లవర్’గా పేరుగన్న సెంట్ థెరిసా ఆఫ్ లిసాక్స్‌కు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్ళీ చూపు వచ్చింది. ఆ తరవాత థెరిసా నాయ్‌మన్ అవయవాలకు తక్షణమే రోగ నివారణ జరిగింది.