పుట:Oka-Yogi-Atmakatha.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

606

ఒక యోగి ఆత్మకథ

“ఇలా రా, విమల్,” అని ఉత్సాహంగా పిలిచాను. “నీకో వార్త చెప్పాలి - ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు!”

“అమెరికాకాండీ?” అంటూ ఆ అబ్బాయి, నా మాటల్ని మారుపలికాడు; “చంద్రలోకానికి” అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా.

“ఔను! కొలంబస్‌లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు; ఈ రెండు దేశాలకీ మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది!”

విమల్ ఎగిరి చక్కాపోయాడు; కాస్సేపట్లో, ఈ రెండు కాళ్ళ వార్తా పత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయమంతకీ తెలిసిపోయింది.

దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి, విద్యాలయాన్ని వారికి అప్పగించాను.

“విద్యాబోధనలో లాహిరీ మహాశయుల యోగాదర్శాన్ని మీ రెప్పుడూ మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచు ఉత్తరాలు రాస్తూ ఉంటాను; దేవుడు సంకల్పిస్తే, ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను,” అన్నాను.

చిన్న చిన్న కుర్రవాళ్ళ వేపూ, ఎండపడుతున్న రాంచీ భూముల వేపూ చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు; ఇకనుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు, అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ (International Congress of Religious Liberals) కు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని