పుట:Oka-Yogi-Atmakatha.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

607

కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది, బోస్టన్‌లో, అమెరికన్ యూనిటేరియన్ ఎసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది.

నా తల సుడిగుండంలో పడ్డట్టయి, శ్రీరాంపూర్‌లో శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధికి చేరాను.

“గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడ్డానికి ఇప్పుడే నా కో ఆహ్వానం వచ్చింది. దయ ఉంచి, మీ సలహా చెప్పండి.”

“నీ కోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి,” అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. “వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు.”

“కాని, గురుదేవా, బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి? నేను ఉపన్యాస మిచ్చిందే అరుదు; అది కూడా ఇంగ్లీషులో ఎన్నడూ కాదు,” అని దిగులుగా అన్నాను.

“ఇంగ్లీషయేది కాకపోయేది; యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాలవాళ్ళు విని తీరవలసిందే.”

నేను నవ్వాను. “బాగుంది, కాని పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను! ఇంగ్లీషు భాషలో అడ్డు చాటుకుపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి.”[1]

నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయటపెట్టేసరికి, ఆయన అదిరి పడ్డారు. అమెరికా, ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలా అనిపించింది; మళ్ళీ నన్నెన్నడూ చూడలేరేమోనని భయపడ్డారు.

  1. శ్రీయుక్తేశ్వర్‌గారూ నేనూ మామూలుగా బెంగాలీలో మాట్లాడుకునే వాళ్ళం