పుట:Oka-Yogi-Atmakatha.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

579

చూసేవాళ్ళకి సంభ్రమాశ్చర్యాలు కలిగేటట్టుగా, లాహిరీ మహాశయులకు అలవాటయిన శారీరక స్థితి- ఊపిరి లేకపోవడం, నిద్రలేక పోవడం, నాడీ గుండె కొట్టుకోడం మానెయ్యడం, గంటల తరబడి రెప్పపాటులేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు, ప్రగాఢమైన ప్రశాంతి పరివేషం వంటి మానవాతీత లక్షణాల్ని ప్రదర్శించేది. ఆత్మోద్ధరణానుభూతి పొందకుండా అక్కణ్ణించి వెళ్ళినవాళ్ళు ఎవ్వరూ లేరు; దైవసాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు.

పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో, “ఆర్య మిషన్ ఇన్‌స్టిట్యూషన్” అనే పేరుతో ఒక యోగకేంద్రం స్థాపించడానికి గురువుగారు ఇప్పుడు అనుమతించారు. ఈ కేంద్రం, యోగసంబంధమైన ఓషధులు పంచిపెడుతూ ఉండేది; భగవద్గీత చౌకధరకు అమ్మడానికి అనువుగా బెంగాలులో మొట్టమొదట ప్రచురణచేసింది ఈ కేంద్రమే. హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్యమిషన్ గీత ప్రతులు వేలాది ఇళ్ళలోకి ప్రవేశం పొందాయి.

సనాతనాచారం ప్రకారం గురుదేవులు, వివిధ రోగాల నివారణకోసం ప్రజలకు సాధారణంగా వేప[1]నూనె ఇస్తూండేవారు. ఈ నూనె బట్టీ

  1. మార్గోసా చెట్టు. దాని ఔషధ విలువలు ఇప్పుడు పాశ్చాత్యదేశాల్లో కూడా గుర్తింపు పొందాయి. చేదుగా ఉండే వేపబెరడు ఒక టానిక్కుగా ఉపయోగిస్తారు; గింజలనుంచీ పళ్ళనుంచీ తీసిన నూనె, కుష్టూ మరికొన్ని ఇతర వ్యాధులూ నయం చెయ్యడానికి వాడతారు.

    హిందూ వైద్యశాస్త్రాల్ని ఆయుర్వేదం అంటారు. వైదిక వైద్యులు సున్నితమైన శస్త్రచికిత్సా పరికరాలు ఉపయోగించారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు, విషవాయువు ప్రభావాలకు విరుగుడు ఎలా వెయ్యాలో తెలుసుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్లూ మెదడు ఆపరేషన్లూ చేశారు. మందుల అంతశ్శక్తిని పెంపుచేయడంలో ఆరితేరారు. క్రీ. పూ. 4 శతాబ్దినాటి హిపోక్రేట్స్ అనే ప్రసిద్ధ గ్రీకు వైద్యుడు, తన మెటీరియా మెడికా (ఔషధ పదార్థ తత్త్వశాస్త్రం) లో చాలామట్టుకు హిందూ ఆధారగ్రంథాల్లోంచి ఎరువు తెచ్చుకున్నాడు.