పుట:Oka-Yogi-Atmakatha.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

578

ఒక యోగి ఆత్మకథ

వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడు. గురువుగారు దాన్ని కూడా నిషేధించారు.

“క్రియాకుసుమ గంధాన్ని సహజరీతిలోనే వ్యాపించనివ్వండి,” అన్నారాయన. “క్రియాబీజాలు, ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాల్లో తప్పకుండా మొలకెత్తుతాయి.”

వ్యవస్థాపకమైన ఆధునిక మార్గం ద్వారా కాని, అచ్చుయంత్రం ద్వారా కాని ప్రచారంచేసే పద్ధతిని మహాగురువులు అవలంబించనప్పటికీ తమ సందేశశక్తి, అడ్డూ ఆపూ లేని వరదవెల్లువలా పెల్లుబికి, తన ధాటితో మానవ మనస్సుల తీరాలను ముంచేస్తుందని ఆయనకు తెలుసు. పరివర్తనచెంది, పరిశుద్ధినందిన భక్తుల జీవితాలే, క్రియాయోగం అమర జీవశక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు.

1886 లో, అంటే రాణీఖేత్‌లో దీక్ష తీసుకొన్న ఇరవై ఐదేళ్ళ తరవాత, లాహిరీ మహాశయులు పెన్షను మీద పదవీవిరమణ చేశారు.[1] పగటిపూట కూడా ఆయన దొరకడంతో, శిష్యులు ఇతోధిక సంఖ్యలో రావడం ప్రారంభమయింది. మహాగురువు లిప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు, ప్రశాంతంగా పద్మాసనబద్ధులై మౌనంగానే కూర్చుంటూ వచ్చారు. కొద్దిసేపు షికారుకు వెళ్ళడానికి కాని, ఇంట్లోనే ఇతర చోట్లకు వెళ్ళడానికి కాని ఆయన తమ గది విడిచి వెళ్ళింది చాలా అరుదు. గురుదేవుల దర్శనం కోసం, దాదాపు ఎడ తెరిపిలేకుండా, శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు.

  1. మొత్తం మీద ఆయన, ఒకే ప్రభుత్వశాఖలో ముప్ఫైఐదేళ్ళ పాటు ఉద్యోగం చేశారు.