పుట:Oka-Yogi-Atmakatha.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

496

ఒక యోగి ఆత్మకథ

“ ‘ఎంతసేపూ మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తూంటారు. పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లోవాళ్ళకోసం ఇంకొంచెం డబ్బు సంపాయించాలన్న ధ్యాసే మీకు లేకుండాపోయిందని నా విచారం.’ ”

“గురుదేవులు ఒక్క క్షణం నావేపు చూశారు; అంతే! అప్పుడే అదృశ్యమయారు. భయాశ్చర్యాలు పెనవేసుకొని పోగా, గదిలో అన్ని వేపులనుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను:

“ ‘అంతా శూన్యం; కనబడ్డం లేదూ? నాలాంటి శూన్యం నీకోసం సంపద లెలా సంపాయించగలదు?’ ”

“ ‘గురూజీ,’ అని పిలిచాను. ‘లక్షమాట్లు క్షమాపణ చెప్పుకుంటాను మీకు! నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి; మీ పావన రూపంలో నాకు దర్శన మియ్యండి.’ ”

“ ‘ఇక్కడున్నాను.’ ఈ జవాబు పైనించి వచ్చింది. కళ్ళు పైకెత్తి చూద్దును కదా, గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు; వారి తల గది కప్పును తాకుతోంది. చూసేవాళ్ళ కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి వారి కళ్ళు. భయంతో వజవజ వణుకుతూ, వారు ప్రశాంతంగా నేలకు దిగివచ్చిన తరవాత ఏడుస్తూ, వారి పాదాలమీద పడిపోయాను.

“ ‘దివ్యసంపత్తిని అన్వేషించు; పనికిమాలిన ముచ్చిబంగారాన్ని కాదు. లోపలి నిధిని కూర్చుకున్నాక, బయటి సంపత్తులు ఎప్పుడూ వస్తూ ఉండడం నువ్వే చూస్తావు,” అన్నారు వారు. ఆ తరవాత, ‘నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు, నీ పోషణకోసం కొంత సమకూరుస్తాడు.’ ”