పుట:Oka-Yogi-Atmakatha.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

23

వారింటికి తరలివెళ్ళడాని కొక అందమైన పల్లకీ, రంగు రంగుల దీపాల తోరణాలు, భారీసైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు-స్కాటిష్-భారతీయ వాద్యబృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు.

పెళ్ళి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేనూ మా నాన్నగారూ మంచి ఉత్సాహంగా ఉన్నాం. కాని ఆ వివాహమహాత్సవం నాటికి కొన్నాళ్ళముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది.

బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి. మా బంగళా వసారాలో నేను, మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా, మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను.

“మీ నాన్నగారిని లేపు!” ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. “మీరు నన్ను చూడాలంటే, తెల్లారగట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చెయ్యండి!” ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది.

“నాన్నా! నాన్నా! అమ్మ చచ్చిపోతోంది!” నా గొంతులోంచి వెలువడ్డ భయార్తస్వరం. నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను.

“అదంతా నీ భ్రమ; దాన్నేం పట్టించుకోకు,” అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో అన్నారాయన. “మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడ్డకబురు ఏమైనా వస్తే రేపు బయల్దేరి వెళ్దాం లే!”