పుట:Oka-Yogi-Atmakatha.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం: 2

మా అమ్మ మరణం,

విచిత్రమైన రక్షరేకు

మా అమ్మకున్న కోరికల్లోకల్లా పెద్దది, మా అన్నయ్యకి పెళ్ళి చేసెయ్యాలన్నది. “అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమిమీదే స్వర్గం చూస్తాను!” తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చెయ్యడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి.

అనంతుడి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ళవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి, పెళ్ళి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నేనూ నాన్నగారూ మట్టుకే, ఉత్తరభారతదేశంలో ఉన్న బెరైలీలో ఉండేవాళ్ళం. అక్కడ రెండేళ్ళున్న తరవాతే, నాన్నగారిని లాహోరు బదిలీ చేశారు.

అంతకుముందు, మా అక్కలిద్దరికి రమకి ఉమకి- పెళ్ళిళ్ళయినప్పుడే చూశాను, వివాహవైభవం. కాని అనంతుడు ఇంటికి పెద్దకొడుకవడంవల్ల, ఈ పెళ్ళికి తలపెట్టిన ఏర్పాట్లు భారీఎత్తున సాగుతున్నాయి. రోజూ ఎక్కడెక్కడినుంచో, వచ్చే చుట్టా లనేకమందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది. 50 ఆమ్హరస్ట్ వీథిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో, వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటుచేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపెళ్ళి