పుట:Oka-Yogi-Atmakatha.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

390

ఒక యోగి ఆత్మకథ

అన్నిటికన్న ఎక్కువ మార్కులు వచ్చింది తత్త్వశాస్త్రం పేపరులోనే. మిగిలిన సబ్జెక్ట్ లన్నిటిలలో అత్తెసరు మార్కులే వచ్చాయి.

స్వార్థరహితుడైన మా స్నేహితుడు రమేశ్, ప్రశంసనీయమైన శ్రేణిలో పట్టం పొందాడని రాయడం నాకు ఆహ్లాదకరమైన విషయం.

నేను పట్టభద్రుణ్ణి అయినందుకు నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. “నువ్వు పాసవుతావని అనుకోనేలేదు, ముకుందా,” అని ఉన్నమాట చెప్పేశారు. “మీ గురువుగారి దగ్గరే ఎక్కువకాలం గడిపేస్తుంటావు.” మా నాన్న గారు పైకి చెయ్యని విమర్శను నిజానికి గురుదేవులు సరిగానే కనిపెట్టారు.

నా పేరు వెనక బి.ఏ. డిగ్రీ చూసుకునే రోజు ఎప్పటికయినా వస్తుందన్న నమ్మకం చాలా ఏళ్ళపాటు లేదు నాకు. అది భగవత్ప్రసాధంగా వచ్చిందన్న ఆలోచనలేకుండా నేను ఆ డిగ్రీని ఉపయోగించడం అరుదు; ఏదో నిగూఢమైన కారణాలవల్ల నా కా డిగ్రీ ప్రసాదించడం జరిగింది. కాలేజిలో చదువుకున్నవాళ్ళు, తాము దిగమింగిన జ్ఞానంలో చాలా కొద్దిగా మాత్రమే, పట్టభద్రులైన తరవాత తమకు మిగిలిందని అంటూండడం అప్పుడప్పుడు వింటూంటాను. వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోడం, విద్యా విషయంలో నిస్సందేహంగా నాకున్న లోపాలకు ఒక్కరవ్వ ఊరట కలిగిస్తుంది.

1915 జూన్ నెలలో నేను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్ననాడు మా గురుదేవుల పాదాలమీద వాలి, ఆయన ప్రాణశక్తి[1]

  1. ఇతరుల మనసుల్నీ, సంఘటన ఘటననూ ప్రభావితం చేసే శక్తి, ఒక ‘విభూతి’ (యోగశక్తి); పతంజలి యోగసూత్రాల్లో మూడో అధ్యాయంలో 24 శ్లోకంలో దీన్ని వివరించాడు. ఈ శక్తి, “సార్వజనీన సానుభూతి”కి ఫలితమని తెలియజేస్తుంది అది. ఈశ్వరుడు మానవుణ్ణి తన సర్వశక్తిమంతమైన రూపంలో సృష్టించాడని పవిత్ర గ్రంథాలన్నీ ఘోషిస్తాయి. విశ్వంమీద నియంత్రణ ప్రకృతికి అతీతమైన దన్నట్టు కనిపిస్తుంది, కాని నిజానికి తన పుట్టుకకు మూలం భగవంతుడనే “సరయిన స్పృహ ”(సమ్యక్ స్మరణ) సాధించిన ప్రతి ఒక్కరిలోనూ అటువంటి శక్తి సహజంగా ఉంటుంది. అహంకారమూ, వ్యక్తిగత వాంఛల రూపంలో అది తల ఎత్తడమూ శ్రీయుక్తేశ్వర్‌గారి మాదిరిగా భగవత్సాక్షాత్కారం పొందిన వాళ్ళలో ఉండవు. నిజమైన గురువుల కార్యకలాపాలు ‘ఋదం’ అనే సహజ ధార్మికతకు అప్రయత్నంగానే అనురూపంగా ఉంటాయి. ఎమర్సన్ మాటల్లో చెప్పాలంటే, మహాపురుషులందరూ, “ధర్మపరాయణులు కావడం కాదు, వారే ‘ధర్మస్వరూపు’ లవుతారు; అప్పుడు సృష్టి లక్ష్యం నెరవేరుతుంది. ఈశ్వరుడు బాగా ప్రసన్నుడవుతాడు. దైవసాక్షాత్కారం పొందిన మనిషి ఎవరయినా సరే, అలౌకిక ఘటనలు ప్రదర్శించగలడు; సూక్ష్మమైన సృష్టి నియమాల్ని అతడు అర్థంచేసుకోడమే దానికి కారణం. కాని సద్గురువులందరూ అద్భుత శక్తుల్ని ప్రయోగించాలని తలపెట్టరు. ప్రతి సాధువూ తన రీతిలో తాను దేవుణ్ణి ప్రతిబింబింపజేస్తూ ఉంటాడు: ఏ రెండు ఇసక రేణువులూ కచ్చితంగా ఒకదాన్నొకటి పోలకుండా ఉండే ఈ ప్రపంచంలో ఈ మాదిరి వ్యక్తిత్వాభివ్యక్తి మౌలికమైనది.

    దైవజ్ఞానం పొందిన సాధువుల్ని గురించి అపవాదంలేని సూత్రాలు రూపొందించడం కుదరదు; కొందరు అద్భుత అలౌకిక చర్యలు ప్రదర్శిస్తారు, కొందరు ప్రదర్శించరు; కొందరు నిష్క్రియులుగా ఉంటే మరికొందరు (ప్రాచీన భారతదేశంలోని జనకమహారాజు, సెంట్ తెరీసా ఆఫ్ ఆవిలా లాంటివాళ్ళు) బృహత్ కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు; కొందరు ఉద్బోధిస్తారు, సంచారం చేస్తారు. శిష్యుల్ని స్వీకరిస్తారు. కాని మరికొందరు నీడమాదిరిగా నిశ్శబ్దంగానూ వినమ్రంగానూ జీవితాలు గడుపుతారు. ప్రతి సాధువుకు వేరువేరు లిపితో రాసిపెట్టిఉన్న రహస్యమైన కర్మలిఖితాన్ని లౌకిక విమర్శకుడెవడూ చదవలేడు.