పుట:Oka-Yogi-Atmakatha.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

365

మహాపురుషులకు శాండో [1]మాదిరి ఆరోగ్యం, బలం ఉండాలని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం అంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదో, అలాగే రోగిష్టి శరీరం ఉన్న మాత్రన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలులేదు. సద్గురువును గుర్తు పట్టడానికి వీలయిన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కాని, శారీరకమైనవి కావు.

ఆధ్యాత్మిక విషయాలమీద ధారాళంగా మాట్లాడడం కాని, రాయడం కాని చేసేవాడు సద్గురువై ఉంటాడని, తబ్బిబ్బయిన సాధకులు అనేకమంది పొరపాటున అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరయినా సద్గురువని చెప్పడానికి నిదర్శనం, తన సంకల్పానుసారంగా ఊపిరిలేకుండా ఉండే స్థితికి (సవికల్ప సమాధి) వెళ్ళే సామర్థ్యంలోనూ, నిర్వికారమైన ఆనందాన్ని (నిర్వికల్ప సమాధి) సాధించడంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధులవల్ల మాత్రమే మానవుడు, ‘మాయ’ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. “ఏకం సత్” (“ఉండేది ఒకే ఒకటి”) అంటూ, అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే.

“అజ్ఞానం కారణంగా ద్వంద్వ భావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్నీ ఆత్మకు భిన్నంగా చూస్తాడు,” అని రాశారు, అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరులు. “ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు, ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించడం జరగదు... మేలుకున్న తరవాత కల ఎలా ఉండదో అచ్చం అలాగే, సత్యాన్ని

  1. “ప్రపంచంలో అందరికన్న బలిష్ఠు”డిగా పేరుగన్న ఒక జర్మన్ క్రీడాకారుడు (మరణం 1955).