పుట:Oka-Yogi-Atmakatha.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

346

ఒక యోగి ఆత్మకథ

శ్రీయుక్తేశ్వర్‌గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంలో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు:

“చూశావా, ఇప్పుడు నీ స్నేహితులతోబాటు స్టేషనులో ఉండి ఉంటే ఏమయ్యేది? సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది,” అన్నారాయన.

చివరికి నేను అర్థం చేసుకున్నాను. మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టే, ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు. మా గురుదేవుల జోక్యం, కనిపెట్టడానికి వీలులేనంత సూక్ష్మమైనది. ఆయన బిహారిద్వారాను, మా బాబయ్యద్వారాను, రాజేంద్రద్వారాను, తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ, ఈ సంఘటనల్ని తర్కసంగతంగాను, సామాన్యంగాను భావించారనుకుంటాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు సామాజిక కర్తవ్యపాలనలో ఎన్నడూ విఫలురు కానందువల్ల, ఆయన కనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి, మా బాబయ్యకి కూడా కబురుచేశారు.

“గురుదేవా, మీరే నాకు నయం చేయ్యగలరు. ఇప్పుడు ఏ డాక్టరు వల్లా నయంకాని పరిస్థితిలో ఉన్నాను,” అన్నాను.

“బాబూ, ఈశ్వరకృప నిన్ను కాపాడుతోంది. డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులుపడకు; నిన్నీ పరిస్థితిలో చూడడాయన. నీకు ఇప్పటికే నయమైపోయిందిలే.”

గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడయిపోయింది.