పుట:Oka-Yogi-Atmakatha.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళలేదు

345

శ్రీయుక్తేశ్వర్‌గారు. “రాజేంద్రానూ తక్కినవాళ్ళు వెంటనే బయల్దేరవచ్చు; వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకుని ఉంటారు. కలకత్తా నుంచి కాశ్మీరుకు సాయంత్రం బయల్దేరే ఆఖరిబండి అందుకోడానికి చాలా వ్యవధి ఉంటుంది.”

“గురుదేవా, మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదండి,” అన్నాను దిగులుగా.

నేనన్న మాట రవ్వంత కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు. ఒక గుర్రబ్బండి తీసుకువచ్చి సామానంతో వేసుకుని వెళ్ళిపోయారు. నేనూ కనాయీ గురుదేవుల పాదసన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక్క అరగంటసేపు మౌనం దాల్చిన తరవాత గురుదేవులు లేచి, రెండో అంతస్తు భోజనాల గదివేపు వెళ్ళారు.

“కనాయీ, ముకుందుడికి అన్నం వడ్డించు. అతని బండి కాసేపట్లో బయల్దేరుతుంది.”

నేను కూర్చున్న కంబళి ఆసనంమీంచి లేస్తూ, హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడంవల్ల తూలిపోయాను. కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో, నన్నెవరో దారుణమైన నరకకూపంలోకి హఠాత్తుగా విసిరిపారేసినట్టు అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పగూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి. శ్రీయుక్తేశ్వర్‌గారూ, కనాయీ నన్ను, కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు.

“గురుదేవా, నా ప్రాణాన్ని మీ ఆధీనం చేస్తున్నాను. అంటూ బాధగా అరిచాను; నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించడమే దానికి కారణం.