పుట:Oka-Yogi-Atmakatha.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

342

ఒక యోగి ఆత్మకథ

కట్టడని నాకు తెలుసు; పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం. బిహారి నా మనస్సులో మెదిలాడు. అతను వెనక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్‌లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పని చేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా, శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చి కి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు.

“ఎక్కడికెళ్తున్నా వోయ్?” శ్రీయుక్తేశ్వర్‌గారి ముఖంలో చిరునవ్వన్నమాటే లేదు.

“గురుదేవా, మనమనుకున్న ప్రకారం ప్రయాణం చెయ్యడానికి మీరు, కనాయీ రావడంలేదని విన్నాను. బిహారికోసం వెతుకుతున్నాను. కిందటేడు, కాశ్మీరు చూడ్డానికి అతనెంతో మనసుపడ్డాడనీ, జీతంలేకుండా పనిచేస్తానని కూడా అన్నాడనీ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది.”

“ఔను, జ్ఞాపకముంది. అయినా బిహారి, రావటానికి ఒప్పుకుంటాడని అనుకోను.”

దాంతో నా సహసం సన్నగిలింది. “సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి!” అన్నాను.

మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లోనే స్కూలు మాస్టరుగారి ఇల్లు చేరుకున్నాను. బిహారి ముంగిట్లోనే ఉన్నాడు; ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినవాడల్లా, నేను కాశ్మీరు మాట ఎత్తేసరికి చటుక్కున మాయమయాడు. క్షమార్పణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొణిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను; బిహారి ఆలస్యానికి కారణం, ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమేకాని మరేం కాదని అంతసేపూ నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. చివరికి వీథి తలుపు తట్టాను.