పుట:Oka-Yogi-Atmakatha.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్‌లో కనిపించడం

337

సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో, ముఖం వేలాడేసుకుని, దిజేన్ గదిలోకీ చక్కా వచ్చాడు.

“గురువుగారు తొమ్మిదిగంటల బండిలోనూ రాలేదు, తొమ్మిదిన్నర బండిలోనూ రాలేదు,” అంటూ మా స్నేహితుడు, ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని చెప్పాడు.

“రా! ఆయన పదిగంటల బండిలో వస్తారని నాకు తెలుసు,” అంటూ నేను దిజేన్ చెయ్యి పుచ్చుకుని, రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా, నాతో లాక్కెళ్ళాను. పదినిమిషాల్లో స్టేషన్‌లో అడుగు పెట్టాం; అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది.

“బండి మొత్తమంతా గురుదేవుల దివ్యప్రభతో నిండిపోయింది! అరుగో, అక్కడున్నారు!” అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను.

“నువ్వలా కలగంటున్నావు!” దిజేన్ వెటకారంగా నవ్వాడు.

“మన మిక్కడే కాసుకొని ఉందాం.” మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో, ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తిచేసేసరికి, శ్రీయుక్తేశ్వర్‌గారు కంటబడ్డారు; కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకొని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు.

నా కళ్ళను నేను నమ్మలేనంత విచిత్రమైన ఈ అనుభవంతో, ఒక్క క్షణం సేపు నాలో భయం పట్టుకుంది. భౌతిక వాదంతో నిండిన ఇరవయ్యో శతాబ్దం నాకు దూరమై దిగజారిపోతున్నట్టు అనిపించింది;అలనాడు ఏసుక్రీస్తు సముద్రం మీద పీటర్‌కు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి నేను తిరిగి వెళ్ళిపోతున్నానా అనిపించింది.