పుట:Oka-Yogi-Atmakatha.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

ఒక యోగి ఆత్మకథ

ఆధునిక యోగి - క్రీస్తు శ్రీయుక్తేశ్వర్ గారు, దిజేనూ నేనూ నోట మాటలేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ, మా స్నేహితుడి వేపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు:

“నీక్కూడా ఒక వర్తమానం పంపాను; కాని నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు.”

దిజేన్ మౌనం వహించాడు; కాని నావేపు అనుమానంగా, వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమందాకా దిగబెట్టిన తరవాత నేనూ మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజికి వెళ్ళిపోయాం. దిజేన్ వీధిలో ఆగిపోయాడు; అతనిలో అణువణువు నుంచీ నామీద ద్వేషం పెల్లుబుకుతోంది.

“అయితే, గురువుగారు నాకు వర్తమానం పంపారు! అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు! దీనికి నువ్వు సంజాయిషీ చెప్పుకోవాలి!”

“నీ మనస్సనే అద్దం, గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించ లేనంత చంచలంగా ఊగిసలాడుతూంటే నే నేమైనా చెయ్యగలనా?" అంటూ ఎదురు ప్రశ్న వేశాను.

దిజేన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. “నువ్వు చెప్పేది అర్థమైంది,” అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. “కాని, దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు; వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది?”

ఆరోజు పొద్దున బోర్డింగ్ హౌస్‌లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను; నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజి వచ్చేసింది.

“మన గురువుగారి శక్తుల్ని గురించి నే నిప్పుడు విన్న వృత్తాం