పుట:Oka-Yogi-Atmakatha.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

129

ఏర్పడే, నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడేవాటి కన్న చాలా తక్కువ వేగం ఉన్నవని గమనించడం జరిగింది. అందువల్ల కొలంబియా కార్యకర్తలు, నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందగొడి చలన చిత్రాలుగా ఫొటోలు తియ్యడానికి, కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేబట్టారు.”

“మనస్సుకూ పదార్థానికీ మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాల్ని తెలుసుకోడానికి ఈ నిటెల్లా మొక్క, ఒక రకమైన రొజెట్టా రాయిలా ఉపకరించవచ్చు [రొజెట్టా అనే వాడు నెపోలియన్ సేనలో ఒక అధికారి; అతనికి ఈజిప్టులో దొరికిన ఒక రాయిమీద, ఒకే విషయం మూడు లిపుల్లో రాసి ఉంది. దీనివల్ల ప్రాచీన ఈజిప్టు దేశపు లిపుల్ని చదవడానికి వీలయింది].”

విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు, ఆదర్శప్రియుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకు చాలా సన్నిహిత మిత్రుడు. ఈయన్ని సంబోధిస్తూ, ఆ వంగదేశపు మధురగాయకుడు ఇలా గానం చేశాడు :[1]

“హే తపస్వి డాకో తూమి సామమంత్రే[2]- జలదగర్జ నే,
“ఉత్తిష్ఠత! నివోధిత!” డాకో శాస్త్ర అభిమానీజీనే–
పాండిత్యేర్ పండతర్క హతే. సుబృహత్ విశ్వతలే
డాకో మూఢ దాంభికేరే. డాక్ దావ్ తబ్ శిష్యదలే–

  1. బెంగాలీ మూలంలో రవీంద్రనాథ్ టాగూరు రాసిన గీతాన్ని మన్ మోహన్ ఘోష్ ఇంగ్లీషులోకి అనువదించి, శాంతి నికేతనం నుంచి వెలువడే ‘ది విశ్వభారతి క్వార్టర్లీ’ అనే పత్రికలో ప్రచురించాడు.
  2. సామమనేది నాలుగు వేదాల్లో ఒకటి. తక్కిన మూడూ: ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం. ఈ పవిత్ర గ్రంథాల్లో, సృష్టికర్త అయిన దేవుణ్ణి బ్రహ్మతత్త్వంగా అభివర్ణించడం జరిగింది. ప్రతి ఒక్క మానవుడిలో, ఈయన్ని జీవాత్మ అంటారు. బ్రహ్మ శబ్దం ‘బృహ్’ ధాతువునుంచి వచ్చింది: ఈ ధాతువుకు, “విస్తరించడం” అని అర్థం. దివ్యశక్తి దానంతట అది పెరగడం, అంటే సృజనాత్మక కార్యకలాపంలోకి దూకడం అనే వైదికార్థాన్ని తెలియజేస్తుంది ఇది. ఈ విశ్వం, సాలీడు గూడు మాదిరిగా, ఆయన సత్తాలోంచే, వివర్తం చెందుతుందని (నికురుతే) చెబుతారు. ఎరుకతో, ఆత్మను బ్రహ్మపదార్థంలో లీనం చేయడం. అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చెయ్యడమే వేదాల మొత్తం సారమని చెప్పవచ్చు.

    వేదాల సారసంగ్రహమైన ‘వేదాంతం’ అనేక మంది పాశ్చాత్య ఆలోచనా పరులకు స్ఫూర్తి నిచ్చింది. ఫ్రెంచి చారిత్రకుడయిన విక్టర్ కూజ్యాఁ (Victor Cousin) ఇలా అంటాడు: “ప్రాచ్యదేశాల తత్త్వశాస్త్ర మహాగ్రంథాల్ని - అన్నిటికన్న మిన్నగా, భారతదేశ గ్రంథాల్ని, మనం సావధానంగా చదివినప్పుడు, ప్రాచ్యదేశాల తత్త్వశాస్త్రం ముందు మోకరిల్ల కుండానూ, మానవజాతికి తొలికాలపు ఉణికిపట్టయిన ఆ ప్రాంతం, సర్వోత్తమ తత్త్వశాస్త్రానికి కాణాచి అని గమనించకుండానూ ఉండలేనంతటి గాఢమైన అనేక సత్యాల్ని, వాటిలో మనం కనిపెడతాం.” ష్లెగెల్ ఇలా అంటాడు: “గ్రీకు తత్త్వవేత్తలు ప్రతిపాదించిన వివేక ఆదర్శవాదం. యూరోపియన్ల సర్వోన్నత తత్త్వశాస్త్రం- కూడా, ప్రాచ్య ఆదర్శవాదానికున్న జీవిత సమృద్ధిముందు జీవశక్తిముందూ, మధ్యందిన మార్తాండుడి ముందు మినుకుమినుకు మంటూండే ప్రామీథియన్ విస్ఫులింగంలా కనిపిస్తుంది (గ్రీకు పురాణ కథల్లో వచ్చే ప్రామిథ్యూస్ ప్రస్తావన ఉందిక్కడ; ఇతడు మానవజాతికి సహాయం చెయ్యడం కోసం సూర్యుడి దగ్గర్నించి నిప్పు దొంగిలించుకు వచ్చాడు).

    భారతదేశపు అపార సాహిత్యంలో, గ్రంథకర్తృత్వం, ఆరోపించి ఉండని గ్రంథాలు వేదాలే (‘విద్’ అనే ధాతువుకు, ‘తెలుసుకోడం’ అని అర్థం). వేద మంత్రాలు అపౌరుషేయాలనీ (ఋగ్వేదం 5, 90, 9), అవి “అతి ప్రాచీనకాలం” నుంచి పారంపర్యంగా వస్తున్నవనీ ఉత్తరోత్తరా కొత్త భాషను ధరించాయనీ (III, 39, 2) ఋగ్వేదం చెబుతోంది. “ద్రష్ట” లయిన ఋషులకు, యుగ యుగాంతరాల్లో దైవ ప్రేరణవల్ల వెల్లడి అయిన ఈ వేదాలకు నిత్యత్వం, అంటే
    “కాలాబాధితమైన ప్రామాణికత" ఉందని చెబుతారు.

    వేదాలు నాదరూపంలో వెలువడి ఋషులకు "నేరుగా వినిపించిన” (శ్రుతి)ని. అవి ప్రధానంగా, మంత్ర పాఠరూపంలో ఉన్న సాహిత్యం. అందుచేత వేదాల్లో ఉన్న 1,00,000 మంత్రాలూ (రెండేసి పాదాలున్నవి) అనేక వేల సంవత్సరాల పాటు బ్రాహ్మణ పురోహితుల మౌఖిక పఠనపాఠనాల వల్ల పరంపరాగతంగా వచ్చినవేకాని ఎవరో రాసి పెట్టినవి కావు. కాయితమూ రాయీ, ఈ రెండూ కాలగతిలో నశించే అవకాశమున్నవే. ఒకరి దగ్గరినుంచి మరొకరి దగ్గరికి అందించడానికి, భౌతిక పదార్థం కంటె మనస్సే బాగా తగిన సాధనమని ఋషులు తెలుసుకొన్నారు. కనక, వేదాలు యుగయుగాంతరాలవరకు నిలిచి ఉన్నాయి. “హృదయ ఫలకాల్ని” మించగలిగినవి మరేమున్నాయి?

    వేద శబ్దాలకున్న ఒక నిర్దిష్ట క్రమాన్ని (ఆనుపూర్వి) గమనించి, ధ్వనుల సంయోజనకూ (సంధి) అక్షరాల పరస్పర సంబంధానికి (సంతానం) ఏర్పడిన ధ్వనిశాస్త్ర నియమాల్ని అనుసరించి, కంఠస్థం చేసుకొన్న పాఠాల శద్ధతను కొన్ని నిష్కృష్ట గణితశాస్త్ర పద్ధతులో నిరూపించి బ్రాహ్మణులు, వేదాల మౌలిక పరిశుద్ధతను అత్యంత ప్రాచీనకాలం నుంచి పరిరక్షిస్తూ వచ్చారు. వేదశబ్దంలోని ప్రతి అక్షరమూ కూడా విలక్షణత ఉన్నది, ఫలప్రదమైనది.